సారాoశం

'Summary‘చతుస్సాగర పర్యంత సారాజ్య సారాభౌములకు అభివాదములు’ అన్నాడు నన్ను అక్కడకు తీసుకెళ్లినవాడు. ఉన్నతాసనం మీద కూచున్నవాడు తల ఊపాడు.
నన్ను తీసుకువెళ్లినవాడు తీసుకెళ్లింది ఓ రాజుగారి దర్బారుకని అప్పుడు తెల్సింది. పెద్ద హాలు గోడల్నిండా అద్దాల బీరువాలు, బీరువాలనిండా రకరకాల సీసాలు. ఎటు చూసినా రంగురంగుల సీసాలు, నిలువెత్తు సీసాలు. పై కప్పు నుంచి కిందికి షాండీర్ల మల్లే వేలాడుతున్నవి కూడా సీసాలే. పరీక్షించి చూద్దును కదా నేల మీద పెద్ద పెద్ద సీసాలు బోర్లించి వున్నవి. వాటిమీద వున్న కుషన్‌ల మీద పెద్ద హోదాలో వున్న ఉద్యోగులు కూచుని వున్నారు. కొన్ని ఖాళీగా వున్న సీసాసనములు చూసిన తర్వాత తెల్సిందీ సంగతి. మెట్లలాగ అమర్చిన సీసాల పైన వేదిక మీద డ్రమ్ముల్లా వున్న సీసాలమీద మెత్తటి పరుపు, దాని వెనుక అమర్చి వున్న సీసాలకి ఆనించి వున్న దిండ్లకు వీపు మోపి ఓ కాలుసాచీ, మరో కాలు మడిచీ కూచుని వున్న వాడు సారభౌముడన్నమాట. వాడి నెత్తిమీద కిరీటం బోర్లించిన సీసాలాగున్నది. తమ తమ సీసాసనాల్లో కూచున్నవాళ్ల తలల మీద చాక్లెట్లు పోసి వుంచే సీసాల మాదిరి వున్న గుండ్రటి సీసాటోపీలు వున్నయి.
దిక్కులేని చోటికి వచ్చి పడ్డ, దిక్కుమాలిన వాడినైన నేను, దిక్కుతోచక ‘వేలెడునుంచి ఏనుగు’ సైజులో వున్న అన్ని సీసాలను బతుకులో మొట్టమొదటి సారి చూడ్డం వల్ల చేష్టలుడిగి, బట్టలషాపు, షోకేసుల్లో బొమ్మలా నిలబడిపోయాను.
ఉలుకూ పలుకూ లేకుండా నిలబడ్డ నన్ను ఉద్దేశించి సారాజ్య సారభౌముడు ఒక్క ఉరుము ఉరిమి ‘ఎవడవురా నీవు?’ అని అరిచాడు. అరిచి ఉరిమాడో, ఉరిమి అరిచాడోగానీ నా తల గిర్రున తిరిగింది. తట్టుకోలేక ఏ సీసానో గుద్ది భళ్లుమనిపించేవాడినే కానీ నన్నక్కడికి తీసుకుపోయినవాడు, నన్ను గట్టిగా పట్టుకుని గండం గట్టెక్కించాడు. ‘బిందుసా వీడ్ని ఎక్కడ్నించి పట్టుకువచ్చావు. నా నోటి వెంట వచ్చే గాలికే మైకం కమ్మినట్టుంది వీడికి’ అన్నాడు సారా సింహాసనం మీద వున్నవాడు. ‘మన సారాతీరంలో పడుంటే మంత్రి అతిసారయ్యగారు మీ దగ్గరికి తీసుకుపొమ్మన్నారు. ప్రధాన అమాత్యుల వారు అతిసారా సేవనం చేసి ఉన్నారు రాత్రి. అందువల్ల ఈ వేళ సారాసభకు రాలేమని చెప్పారు!’ అన్నాడు బిందు సారుడు నన్ను రెక్కపట్టుకుని.
ప్రధాన అమాత్యులు అతిసారులు అతిసారా సేవనం చేశారు కనక సభకు రాలేరట. మంత్రి మహాసారా! మీరే ఈ పరదేశస్తుడ్ని ఏం చెయ్యాలో చెప్పాలి అన్నాడు. సారభౌముడు చేతపట్టుకుని ఉవన్న సీసా మూతని పళ్ల మధ్య బిగించి పట్టి పీకే ప్రయత్నం చేస్తూ ఆయన సగం తాగిన సీసాను, సీసాసనం పక్కన పెట్టి తడబడే అడుగుల్తో లేచి నిలబడీ లేక ఊగులాడుతూ వుంటే కుంభసారుడూ, దీర్ఘసారుడూ రెండు వైపులా పట్టుకునిలబడ్డారు. వాళ్లపేర్లు నాకు తర్వాత తెలిశాయి. అసలక్కడ జనమందరి పేర్ల చివర ‘సార’ అని వుండి తీరవల్సిందే. అక్కడ కులమతాల ప్రసక్తే లేదు. అందరూ ‘సార’ మతస్తులే.
సారభౌముల ‘భౌభౌ’లకు బెంబేలెత్తిన నేను నోరు మెదపలేకపోయాను. నోరుతెరిస్తే అక్కడి గాలి నోట్లో దూరి మైకం కమ్మి పడిపోతానని భయంవేసింది. నన్ను తీసుకువచ్చిన బిందుసారుడు ‘సారాజీ! సారాపనా! మన సారా సముద్రతీరాన పడి వున్న వీడు ఇంతవరకు నోరు విప్పలేదు. మీరు అనుమతిస్తే నావెంట తీసుకుపోయి మనసారా దేశపు సంగతులన్నీ చెప్పి, భయం పోగొట్టి మాటాడేట్టు చేసి మీ ముందుకు తీసుకువస్తాను అన్నాడు. ఇక్కడ వీచే గాలికే కొట్టుకుపోయేలా వున్న వీడు మన సారా సముద్రం ఈది పారిపోలేడులే నీవెంటే వుండనీ. మన గాలికి అలవాటు పడ్డాక మాటలాడుదాం’ అన్నాడు సారాజు.
ఆ తర్వాత నన్ను బిందుసారుడు సీసాంగణంలోకి తీసుకువెళ్లాడు. సారాసభ రంజుగా సాగుతున్నది. డాన్సర్లు ‘సారా… సారా… సారొస్తుందొస్తుందోరు, దాయి.. దాయిదామ్మా, కొంచెం సార తాగిపోమ్మా’ వంటి రికార్డు డాన్సులు చేస్తున్నారు. ఒక కవి సారభౌముడు ‘సారోచిష మనుసంభవమనే గ్రంథంలోంచి సీస పద్యాలు వినిపించాడు. ‘ఇందుగలదండులేడని సందేహము వలదు ఎందెందు వెదికిన అదందే గలదుసార’ అనే పద్యాన్ని తన ‘సారగంగ మహత్యం’ అనే వాక్యం నుంచి చదివి వినిపించేడొక ‘సారపీఠ’ అవార్డు గ్రహీత. కళాసారులందరికీ రకరకాల సారాసీసాల ప్రదానం అయ్యాక సారా రభస ముగిసింది.
బిందుసారుడు నన్ను వీధులవెంట తిప్పాడు. ఇళ్లన్నీ సీసాల ఆకారంలో వున్నాయి. రోడ్ల మీద డివైడర్లు సీసాలతో కట్టినవే. జనం చేతుల్లో సారాసీసాలు ఊపుతూ వెళ్తున్నారు. అప్పటికి సర్దుకుని నోరు తెరిచిన నేను అడిగాను ‘ఇదేమి రాజ్యం, సారా రాజ్యం’ అని.
‘పరదేశీ! మా ఈ దేశం వున్నదే సారా సముద్రతీరాన. చతుస్సారా సాగరం అంటే నాలుగు సారా సముద్రాలని మా నమ్మకం’.
‘సారా తప్ప మరోటి లేదా ఈ దేశంలో’ అన్నాను చిరాగ్గా.
‘మాది ఒకే వేదం అదే సారవేదం. మా దేవుడు ఒక్కడే సారమేశ్వరుడు. మేం తినేది సార, మేం తాగేది సార. మేం ఊగేది సార. సారాలో పుడ్తాం, సారాలో పడ్తాం. సారాలో చస్తాం. జగమే సారమయం’ అన్నాడు బిందుసారుడు తన్మయత్వంలో తూగుతూ.
‘మీ ఆడవాళ్లెవరూ కనపడరేం. వాళ్లూ సారవంతులేనా?’ అన్నాను.
‘లేదు, కాదు. వాళ్లు సారసతులు. కాయలూ, దుంపలూ, మా తన్నులూ తింటారు. ఇళ్ల అరుగుల మీద మా కోసం ఎదురు చూస్తుంటారు’ అన్నాడు.
‘సారా సామ్రాజ్యంలో వుండే మీరు మాటిమాటికీ సారా అన్న మాట వాడడం నాకు నచ్చలేదు. మా రాజ్యంలో దీన్ని మందు అంటాం. రకరకాల పేర్లతో ముద్దుగా పిల్చుకుంటాం’ అన్నాన్నేను.
‘ఏ పేరుతో పిల్చినా సారా సారాంశం ఒక్కకే కదా!’ అన్నాడు బిందుసారుడు వెంట తెచ్చుకున్న సీసా మూతకు స్వేచ్ఛను ప్రసాదించే ప్రయత్నం చేస్తూ. ఇదే మంచిసమయం అని బిందుసారుడిని పక్కకు తోసి పరుగుతీశా.
సారా తాగించి జనాల జేబులు కొల్లగొట్టకపోతే సర్కార్లు పనిచెయ్యలేవు. వాడవాడలా వెలిసిన మందుషాపులు సర్కారువారికి ఏటీయమ్‌లు కదా అనుకుంటూ పరాకుగా నడుస్తున్న నేను, నడిరోడ్డుమీద పగిలిన సీసా గాజు పెంకు గుచ్చుకోవడంతో కెవ్వుమని అరుస్తూ మంచం మీదినుంచి కిందకు దొర్లి పడ్డాను.
– చింతపట్ల సుదర్శన్‌
9299809212