– వచ్చే నెల ఐదు నుంచి 20వరకు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఐదు నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మర్ క్యాంంపు నిర్వహించనున్నట్టు ఆ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్ సోమయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎస్వీకేలో పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లల ఆసక్తికి తగిన విధంగా వారి ప్రతిభను గుర్తించి, మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంపును నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీ ప్రపంచంలో మనగలగాలంటే చదువొక్కటే సరిపోదనీ, ఆటలు, పాటలు, తదితర అన్ని అంశాల్లో ప్రావిణ్యం సాధించాల్సిందేనని వివరించారు. వేసవి సెలవుల్లో .. కాలాన్ని వృథా చేయకుండా కొత్త కళలను, సరికొత్త పనిలో ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ఆ ఆసక్తిని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. చిన్నపిల్లల్లో అరుదైన ప్రతిభతో పాటు సృజన శక్తి దాగుంటుందనీ, దాన్ని గుర్తించి బయటకు తీయాలన్నారు. అందుకు తెలంగాణ బాలోత్సవ కమిటీ కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం కమిటీ సభ్యులు ఎన్.శంకర్, రేష్మ, విజిత పాల్గొన్నారు. 9490098343, 9490098676 సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.