పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించ నున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పవన్‌కళ్యాణ్ రాకతో చిత్ర బృందం రెట్టింపు ఉత్సాహంతో భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణను విజయవాడలో ప్రారంభించింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈనెల 23న విజయవాడలో ప్రారంభమైంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో చిత్ర బృందం భారీ సెట్‌ను నిర్మించింది. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది ఫైటర్లతో పాటు, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.