సుందరయ్య జీవితం ప్రజాసేవకే అకింతం

– యువత సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
– ప్రజానాట్యమండలి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు జగన్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. ఆంజనేయులు, కానుగుల వెంకటయ్య
– సుందరయ్యకు ఘన నివాళి
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్‌
సుందరయ్య జీవితం సమాజ సేవకే అంకితం చేశారని ప్రజానాట్యమండలి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు జగన్‌ అన్నారు. తలకొండపల్లి మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామంలో ఆదివారం రాత్రి పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతిని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సీపీఐ(ఎం) జెండావిష్కరించి, సుందరయ్య చిత్రపటానికి పలువురు సీపీఐ(ఎం) నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారుల విప్లవ పాటలు ప్రజలను ఆకర్షించాయి. కామ్రేడ్‌ కానుగుల వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఎంప్లాయీస్‌ వాయిస్‌ ప్రతిక ఎడిటర్‌ కె. వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య పుట్టింది ధనిక భూస్వామ్య కుటుంబంలో అయినా, ఆయన జీవితకాలం అంతా పేద ప్రజల కోసం, దళితులకు సమాన హక్కుల కోసం, స్త్రీ సమానత్వం కోసం, అసమానతలు లేని దోపిడీ పీడనలేని సమాజం కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. కుల వివక్షతపై పోరాటం ముందుగా తన గ్రామంలో తన ఇంటి నుంచే ప్రారంభించారని తెలిపారు. అంతేకాకుండా దళితులకు, అంటరాని స్థలానికి వ్యతిరేకంగా సహపంతి భోజనాలు పెట్టించారని వివరించారు. పిల్లలు పుడితే కుటుంబం సంపాదన అనే స్వార్థం ఎక్కడ ఏర్పడుతుందోననీ, జీవిత భాగస్వామి లీలాను ఒప్పించి కుటుంబ నియంత్రణ తరువాతే పెండ్లి చేసుకున్న మహానీయులని వారని కొనియాడారు. వ్యవసాయ కార్మికుల కోసం ఉపాధి హామీ చట్టం సాధించి పెట్టినటువంటి ఘనత సీపీఐ(ఎం)కే దక్కుతోందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీకి తూట్లుపొడిచే విధంగా ప్రతి ఏటా తూట్లు పెడుతుందని దుయ్యబట్టారు. కులమతాల పేరుతో దేశంలో ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి దేశాన్ని పాలించాలని చూస్తున్న బీజేపీని గెలిస్తే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. అందుకే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సుందరయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు, అంబేద్కర్‌ పూలే జాతర కమిటీ నాయకులు సుధాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు డి.రఘురాములు, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు డి. చెన్నయ్య, జగన్‌ రైతు సంఘం రాష్ట్ర నాయకులు టి.కిషోర్‌, డీవైఎఫ్‌ఐ అమంగల్‌ ఏరియా కమిటీ కార్యదర్శి శివశంకర్‌, ఎల్బీనగర్‌ డివిజన్‌ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు అరుణ్‌ కుమార్‌, సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాసులు, పిప్పళ్ళ వెంకటయ్య పెద్ద ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.