సుందరయ్య వర్తమానమే…

Sundaraya is present...సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం వల్ల కొంతమంది సుందరయ్యను రైతు నాయకుడనుకుంటారు. ఆంధ్ర ప్రాంతంలో మొదట వ్యవసాయ కార్మికసంఘం ప్రారంభించింది ఆయనే. అంతేకాదు, తొలి కార్మికోద్యమ నేతలలో ఆయనొకరు. విప్లవోద్యమంలో పారిశ్రామిక కార్మికవర్గం, ప్రభుత్వరంగ పరిశ్రమల్లో కార్మికోద్యమం పాత్రను సరిగ్గా అంచనా వేశారు. అందుకే కొత్తగూడెంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు 4వ మహాసభలో దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు, పారిశ్రామిక కార్మికులను సంఘటితం చేయకుండా కార్మికోద్యమం తన చారిత్రక పాత్ర నిర్వహించజాలదని నొక్కిచెప్పారు. కార్మికోద్యమంలో ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. కార్మికుల సమస్యలు తమ పనిప్రదేశంలో మాత్రమే కాకుండా నివాస ప్రాంతాల్లో కూడా పట్టించుకోవాలని చెప్పారు.

సమాజంలో అభివృద్ధితో పాటు గుర్తింపు సమస్య కూడా ముందుకొచ్చింది. తాము చేస్తున్న కృషికి తగిన గుర్తింపు రావడంలేదని భావించేవారున్నారు. ముందువరసన నిలవటం, సోషల్‌ మీడియాలో, వేదికల మీద కనిపించడం కోసం తాపత్రయం ఇందుకే పెరుగుతున్నది. ప్రజా ప్రతినిధులయితే గుర్తింపు వస్తుందనే అభిప్రాయాలూ చూస్తున్నాము. కానీ గుర్తింపు కోసం ఏరోజూ ఆలోచించని కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రజా ఉద్యమం మీద చెరగని ముద్ర వేసింది. ప్రజా ఉద్యమంలో పాత్రను బట్టి వచ్చే గుర్తింపు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పడానికి ఆయనే ఒక నిదర్శనం. మొదట్లోనే చెప్పుకున్నట్టు నాటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా సుందరయ్య పేరు వినడంతోనే బయటికి వచ్చి మాట్లాడేంత గుర్తింపు ప్రజా ఉద్యమ నేపథ్యం నుంచే వచ్చింది కదా. సాయుధ రైతాంగ పోరాట యోధుడు కావటమే అందుకు కారణం కదా. ప్రజలే ఆయన కుటుంబం. పార్టీనే ఆయన జీవితం.

అది ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నివాసం. పొద్దున్నే పుచ్చలపల్లి సుందరయ్య ఆమెతో మాట్లాడటం కోసం వెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం. సుందరయ్యగారు మాట్లాడాలనుకుంటున్నారని ఆమెకు సమాచారం పంపారు. ”ఆయనకి ఎప్పుడు వీలవుతుందో చెప్పమను, తప్పకుండా కలుస్తాను” అని ఆ వార్తాహరునితో చెప్పారు. ఆ తర్వాత వచ్చింది సుందరయ్యే అనే విషయం తెలిసిన మరుక్షణం ఇందిరాగాంధీ బయటకువచ్చి ఆయనతో చర్చించారు. కాంగ్రెసు పార్టీకి, మార్క్సిస్టులకు మధ్య ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఘర్షణ జరుగుతున్న కాలమది. అయినా ఆమె పుచ్చలపల్లి సుందరయ్య పేరు వినగానే అంతటి ప్రాధాన్యత నిచ్చారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కావటమే ఇందుకు కారణం.
ఈరోజు సుందరయ్య వర్ధంతి జరుపు కుంటున్నాము. సుందరయ్య బాట, సుందరయ్య స్ఫూర్తి గురించి మాట్లాడుకుంటున్నాము. వాటికి అర్ధమేమిటి? అనేకమంది కమ్యూనిస్టుల వర్థంతులలో సుందరయ్య వర్థంతి కూడా ఒకటి అని చెప్పగలమా? సుందరయ్య వర్థంతికి ఎందుకింత ప్రాధాన్యత? కొత్త తరం కమ్యూనిస్టులకిది ఆశ్చర్యకరమే. కాలం గడుస్తున్న కొద్దీ సాధారణంగా ‘గతం’ గత స్మృతులుగానే మిగిలిపోతాయి. కానీ సుందరయ్య ఈనాటికీ ప్రస్తుతమే. ‘సుందరయ్య’ ప్రాసంగికత (రిలవెన్స్‌) మరింత పెరిగింది. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజలతో మమేకం కావడం ఒక ప్రత్యేక అంశంగా ఇప్పుడు ముందుకొచ్చింది. జెండా ఏదైనా కమ్యూనిస్టులు లేదా వామపక్షవాదుల అందరి ఎజెండా ఇదే అయింది. అందుకే సుందరయ్య జీవితమే నేటి కమ్యూనిస్టులకు ఒక పాఠశాల. ప్రజలతో సంబంధాలంటే ఏమిటో సుందరయ్య జీవితాన్ని అధ్యయనం చేస్తే అర్ధమవుతుంది. పేదలకు ఏ కష్టం వచ్చినా తాను చేయగలిగే సహాయం చేశారు. తన పరిధిలో లేకపోతే అధికారులు, పాలకుల దృష్టికి తెచ్చారు. అయినా పరిష్కారం కాకపోతే పోరుబాట పట్టారు. పేదలకు వైద్యం చేయటం, చవకగా సరుకులు అందించడం దగ్గరినుంచి చేయగలిగినదంతా చేశారు. సేవా తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. కార్యకర్తల పట్ల అమితమైన శ్రద్ధ కనబరిచేవారు. సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత తాను స్వయంగా కలవగలిగినంతమంది కార్య కర్తలను కలిసే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారి అనుభవాలను సేకరించారు. ప్రజల కోసం ప్రాణా లర్పించిన యోధుల వివరాలు గ్రంధస్తం చేశారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాం గ పోరాటంతో పెనవేసుకున్నారు. కార్యాలయంలో కూర్చుని సూచనలు చేయడానికి పరిమితం కాలేదు. రేయింబవళ్లు, అడ వుల్లో, కొండల్లో, గుట్టల్లో వందల కిలోమీటర్లు కాలినడకన పోయి దళాల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా సూచనలు అందించారు. ప్రజలతో, ప్రజా ఉద్యమాలతో మమేకం కావడానికి నిలువుటద్దమే సుందరయ్య జీవితం.
పురుషాధిక్యతను ప్రశ్నించటం తన కుటుంబం నుంచే ప్రారంభించారాయన. భార్యల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించేవారు. భార్య మీద చేయి చేసుకున్న పార్టీ సభ్యులకు పార్టీలో కొనసాగే అర్హత లేదని చెప్పేవారు. నాటికీ, నేటికీ దశాబ్దాలు గడిచాయి. సమాజంలో అనేక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. సాధికారతా చైతన్యం పెరుగుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధితో పాటు మహిళను వ్యాపార సరుకుగా చూసే ధోరణి పెరిగింది. వీటన్నింటితో పాటు సమాజంలో మహిళల మీద లైంగిక వేధింపులు, దాడులు కూడా పెరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమానికి ఇవి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. కులవివక్ష కూడా సమాజాన్ని ఆవహించిన ఒక పెద్ద జాడ్యం. సమాజాభివృద్ధి క్రమంలో దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులనుంచి చదువుకున్నవారి సంఖ్య పెరిగింది. వివిధ రంగాలలో భాగస్వామ్యం కూడా పెరిగింది. సహజంగానే వివక్షను ప్రశ్నించేతత్వం కూడా పెరిగింది. తట్టుకోలేని కుల దురహంకార శక్తుల దాడులు పెరుగుతున్నాయి. ప్రజా పోరాటాలు పైచేయి అయినప్పుడు కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా కష్ట జీవులు ఐక్యంగా పోరాడారు. సుందరయ్య నేతృత్వంలో సాగిన సాయుధ రైతాంగ పోరాట కాలంలో అను భవం కూడా ఇదే. సభలు, సమావేశాలకు హాజరయిన వారం దరికీ భోజనాలు వండి వార్చడంలో దళితులు కూడా భాగస్వాములే. గ్రామ రాజ్యాలలో కుల భేదం, లింగ భేదం పట్టింపులు లేవు. అందరూ సమానమే. కానీ సాయుధ పోరాట అనంతర కాలంలో క్రమంగా ప్రజా ఉద్యమాల మోతాదు తగ్గుతూ వచ్చింది. పెట్టుబడి ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. అందుకే కులము, కులవివక్ష కొనసాగుతూ వస్తున్నాయి. పైగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన యువతలో ప్రశ్నించేతత్వం పెరిగినందువల్ల దురహంకారుల దాడులు కూడా పెరుగుతున్నాయి. సామాజిక సమస్యల పరిష్కారం కోసం కూడా వర్గ పోరాటం ఉధృతం కావలసిన ఆవశ్యకతను ఇవన్నీ రుజువు చేస్తున్నాయి. సుందరయ్య తన జీవితమంతా వర్గ దృక్పథానికి, వర్గ పోరాటానికీ అంకితమయ్యారు.
అధ్యయనం ఆయన ప్రత్యేకత. సమాజాన్నీ, ఆర్థిక వ్యవస్థనూ లోతుగా అధ్యయనం చేసేవారు. సమాజ మార్పు కోసం సాగే వర్గ పోరాటంలో కార్మికవర్గ నాయకత్వ పాత్రను నొక్కి చెప్పారు. సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం వల్ల కొంతమంది సుందరయ్యను రైతు నాయకుడనుకుంటారు. ఆంధ్ర ప్రాంతంలో మొదట వ్యవసాయ కార్మికసంఘం ప్రారంభించింది ఆయనే. అంతేకాదు, తొలి కార్మికోద్యమ నేతలలో ఆయనొకరు. విప్లవోద్యమంలో పారిశ్రామిక కార్మికవర్గం, ప్రభుత్వరంగ పరిశ్రమల్లో కార్మికోద్యమం పాత్రను సరిగ్గా అంచనా వేశారు. అందుకే కొత్తగూడెంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు 4వ మహాసభలో దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు, పారిశ్రామిక కార్మికులను సంఘటితం చేయకుండా కార్మికోద్యమం తన చారిత్రక పాత్ర నిర్వహించజాలదని నొక్కిచెప్పారు. కార్మికోద్యమంలో ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. కార్మికుల సమస్యలు తమ పనిప్రదేశంలో మాత్రమే కాకుండా నివాస ప్రాంతాల్లో కూడా పట్టించుకోవాలని చెప్పారు. కంపెనీలలో యూనియన్లు నిర్మించి వారి వేతనాలు, భత్యాలు, ఇతర సమస్యల పరిష్కారానికి మాత్రమే పరిమితం కావద్దన్నారు. కార్మికులు ఎక్కువ సమయం నివాస ప్రాంతంలోనే గడుపుతారు. వారు నివాస ప్రాం తంలో ఎదుర్కొనే పౌర సమస్యలు, శాంతిభద్రతలు, ఆర్థిక, సామాజిక సమస్యలపట్ల కూడా శ్రద్ధ వహించా లన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం పని ప్రదేశంలోనే కాకుండా నివాస ప్రాంతాలలో కూడా ప్రజలతో మమేకం కావాలన్నారు. దాని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు గమనిస్తున్నాము. క్షేత్ర స్థాయిలో లోతైన అధ్యయనం లేకుండా ఏ నిర్ణయమూ చేసేవారు కాదు. గ్రామాల్లో వ్యవసాయక సంబంధాలను నిర్ధిష్టంగా అధ్యయనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సమస్య లోతుల్లోకి వెళ్లారు.
నాటికీ, నేటికీ పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాలలో కూడా అనేక మార్పులు వచ్చాయి. మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా వ్యాపార సంబంధాలు విస్తరిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మరోసారి అధ్యయనం చేసి అంచనా వేసింది. కానీ ప్రపంచీకరణ నేపధ్యంలో పెట్టుబడిదారీ సంబంధాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు విశాలమైన భారతదేశం వైవిధ్యభరితం. నేటి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ అన్ని ప్రాంతాలూ ఒకేరకంగా లేవు. ఉద్యమ కార్యకర్తలు తాము పనిచేస్తున్న పరిధిలోని గ్రామాల్లో ఎవరికి వారు నిర్ధిష్టమైన అధ్యయనం చేయవలసిందే. ఇప్పటికే జరిగిన అధ్యయనాలను లోతుగా అర్ధం చేసుకుంటూనే తాము స్వయంగా దిగబడి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయాలి.
సమాజంలో అభివృద్ధితో పాటు గుర్తింపు సమస్య కూడా ముందుకొచ్చింది. తాము చేస్తున్న కృషికి తగిన గుర్తింపు రావడంలేదని భావించేవారున్నారు. ముందువరసన నిలవటం, సోషల్‌ మీడియాలో, వేదికల మీద కనిపించడం కోసం తాపత్రయం ఇందుకే పెరుగుతున్నది. ప్రజా ప్రతినిధులయితే గుర్తింపు వస్తుందనే అభిప్రాయాలూ చూస్తున్నాము. కానీ గుర్తింపు కోసం ఏరోజూ ఆలోచించని కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రజా ఉద్యమం మీద చెరగని ముద్ర వేసింది. ప్రజా ఉద్యమంలో పాత్రను బట్టి వచ్చే గుర్తింపు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పడానికి ఆయనే ఒక నిదర్శనం. మొదట్లోనే చెప్పుకున్నట్టు నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా సుందరయ్య పేరు వినడంతోనే బయటికి వచ్చి మాట్లాడేంత గుర్తింపు ప్రజా ఉద్యమ నేపథ్యం నుంచే వచ్చింది కదా. సాయుధ రైతాంగ పోరాట యోధుడు కావటమే అందుకు కారణం కదా. ప్రజలే ఆయన కుటుంబం. పార్టీనే ఆయన జీవితం. నిరంతరం సేవా కార్యక్రమాలు, ప్రజా పోరాటాలు, ప్రజాసంఘాలు, పార్టీ నిర్మాణం చుట్టూనే ఆయన ఆలోచనలు. తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదు. ‘మన’ గురించి, ప్రజలందరి గురించి మాత్రమే పని చేసారాయన. అందుకే ఆయన స్ఫూర్తి ప్రదాత. అదే సుందరయ్య మార్గం.