సునేహ్రీ బాగ్‌ మసీదు కూల్చివేత పిల్‌

– తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని సునేహ్రీ బాగ్‌ మసీదు కూల్చివేతను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ పిఎస్‌ అరోరాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌, ఇదే విధమైన పిటిషన్‌ కోర్టు సింగిల్‌ బెంచ్‌ ముందు పెండింగ్‌లో ఉన్నదని తెలిపింది. ”వక్ఫ్‌ ఆస్తులను పరిరక్షించటానికి ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు తన చట్టపరమైన, కార్యనిర్వాహక విధులను నిర్వర్తించటంలో ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నందున, ప్రస్తుత రిట్‌ పిటిషన్‌లో ఎటువంటి ఆర్డర్‌ అవసరం లేదని ఈ కోర్టు అభిప్రాయపడింది” అని ధర్మాసనం వివరించింది. డిసెంబర్‌ 24న, న్యూఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ జనవరి 1, 2024లోగా మసీదు తొలగింపుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను సమర్పించాలని సాధారణ ప్రజలను కోరుతూ నోటీసు జారీ చేసింది. మసీదును తొలగించాలన్న మునిసిపల్‌ కౌన్సిల్‌ యోచనకు వ్యతిరేకంగా ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను డిసెంబర్‌ 18న హైకోర్టు ముగించటంతో నోటీసు వచ్చింది. అన్ని పార్టీలు చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు ఆ సమయంలో దేశించింది.