సునీల్‌రెడ్డి బాండుపేపర్ ఓ  మోసం

– ప్రజలను బోల్తా కొట్టించే దివాళకోరు రాజకీయం
– నాడు అర్వింద్‌.. నేడు అదే బాటలో సునీల్‌
– ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నమ్మడం లేదని సునీల్‌ ఒప్పుకున్నట్టే
– ఐదేండ్లలో ఐదు పార్టీలు మారిన సునీల్‌.. అందుకేనా ఈ బాండుపేపర్‌
– ప్రజలు బాండు పేపర్‌ చీప్‌ ట్రిక్కును నమ్మొద్దు.
– అభివృద్ధికి బ్రాండ్ మంత్రి వేముల
– పనిచేసిన వారిని వరుసగా నాలుగు సార్లు గెలిపించుకున్న చరిత్ర బాల్కొండది
– సునీల్‌రెడ్డి బాండుపేపర్ పై డా.మధుశేఖర్‌, కోటాపాటి ధ్వజం
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: బాల్కొండ కాంగ్రెస్‌ అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డి ఆ పార్టీ ఆరు గ్యారెంటీలకు తన హామీ అంటూ విడుదల చేసిన బాండు పేపర్ ఓ మోసపూరిత రాజకీయమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మధుశేఖర్‌, రైతు నాయకుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు ధ్వజమెత్తారు. సోమవారం వేల్పూర్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలను బోల్తా కొట్టించే దివాళకోరు రాజకీయాలకు సునీల్‌రెడ్డి పాల్పడుతున్నాడని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు ఇస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, నెలరోజులుగా తన ప్రచార కార్యక్రమాల్లో సునీల్‌ రెడ్డి గ్రహించాడన్నారు. అందుకే ఆరు గ్యారెంటీలపై సొంత బాండుపేపర్‌ డ్రామాకు తెరలేపాడని, తద్వారా కాంగ్రెస్  ఆరు గ్యారెంటీల హామీని ప్రజలు ఏ మాత్రం విశ్వసించడం లేదని సునీల్‌ రెడ్డి ఒప్పుకున్నట్టేనన్నారు. నాడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ధర్మపురి అర్వింద్‌ బాండు పేపర్‌ రాసిచ్చి నాలుగున్నర సంవత్సరాలుగా రైతులను మోసం చేస్తున్న ఫార్మూలాను నేడు సునీల్‌ రెడ్డి అనుసరిస్తున్నాడని ధ్వజమెత్తారు. బాండు పేపర్‌ చీప్‌ ట్రిక్కను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రి వేముల  ప్రశాంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి కళ్లముందే ఉందన్నారు. అభివృద్ధికి ప్రశాంత్‌రెడ్డి బ్రాండ్‌గా నిలిచారన్నారు. పనిచేసిన వారిని వరుసగా నాలుగు సార్లు గెలిపించిన చరిత్ర బాల్కొండ నియోజకవర్గ ప్రజలదని గుర్తు చేశారు. రెండు సార్లు వరుసగా గెలిచిన ప్రశాంత్‌రెడ్డిని ఈసారి కూడా గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు చేయలేక అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. కరెంటు ఐదు గంటలు కూడా సరిగ్గా ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. కడుపు మండిన కర్ణాటక రైతులు  కాంగ్రెస్‌  మోసపూరిత మాటలను నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు హితవు పలుకుతున్నారని గుర్తు చేశారు. కర్ణాటక రైతులు మన హైదరాబాద్‌కు వచ్చి కర్ణాటకలో కాంగ్రెస్‌ చేసిన మోసాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. సునీల్‌రెడ్డికి అధికార యావనే తప్ప రాజకీయంగా నిలకడలేని చరిత్ర అని విమర్శించారు. ఐదేండ్లలో ఐదు పార్టీలు మారిన నిలకడలేని సునీల్‌ రెడ్డిని నమ్మితే మోసపోతామన్నారు. 24 ఏండ్లుగా ఒకే పార్టీని, ఒకే నాయకుడిని నమ్ముకున్న ప్రశాంత్‌రెడ్డి నిలకడ, కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడన్నారు. సునీల్‌రెడ్డి బాండ్‌ పేపర్ ను పిల్లచేష్టగా అభివర్ణించారు. అబద్దాలు ఆడకూడదనే పవిత్ర కార్తీక పౌర్ణమి నాడు అబద్దాల బాండ్‌ పేపర్‌ను విడుదల చేశాడని దుయ్యబట్టారు. బీఎస్పీ పార్టీని వాడుకుని ఓట్ల కోసం బహుజనులను మోసం చేశాడన్నారు. ధర్మపురి అర్వింద్ బాండ్‌ పేపర్‌ వైనాన్ని గుర్తు పెట్టుకుని సునీల్‌ బాండు పేపర్‌ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా తన వ్యక్తిగతంగా కరోనా ఆపతికాలంలో దవఖానలకు శాశ్వతంగా ఆక్సిజన్‌, బెడ్‌ల సౌకర్యం కల్పించడం, పన్నెండువేల మంది యువకులకు డ్రైవింగ్‌ లైసెన్సులు, హెల్మెట్లు ఉచితంగా సమకూర్చడం, అత్యాధునిక అంబులెన్స్ వాహనాన్ని అందివ్వడం, నిరుద్యోగ ఉద్యోగార్తులకు పెద్ద ఎత్తున శిక్షణ, భోజన, ప్రిపరేషన్‌ మెటీరియల్ అందజేత కార్యక్రమాలు చేయడం లాంటివి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారన్నారు. కాంగ్రెస్‌  మేనిఫెస్టోను  ప్రజలు నమ్మడం లేదని, బాండుపేపర్‌ ద్వారా సునీల్‌రెడ్డి చాటి చెప్పాడన్నారు. కర్ణాటకలో ప్రతి మహిళకు రెండు వేల రూపాయల పథకాన్ని 90 లక్షల మంది మహిళలకు ఇస్తామని ఓట్లు వేసుకున్న కాంగ్రెస్‌ కేవలం 10 లక్షల మందికి ఒకనెల మాత్రమే ఇచ్చి ఎగ్గొట్టిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ చేసిన మోసాలపై కర్నాటక ప్రజలు, రైతులు చేస్తున్న నిరసనల, విమర్శల వీడియో క్లిప్పింగులను సాక్షాలుగా మీడియా ముందు ప్రదర్శించారు. సమావేశంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌, వేల్పూర్‌ ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, తదితరులు