రాష్ట్రమంతటా ఎండ… హైదరాబాద్‌ చుట్టూ వర్షం

– కీసరలో 4.23 సెంటీమీటర్ల వాన
– రాయిని గూడెంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రమంతా బుధవారం మాడుపగిలేలా ఎండలు కొడితే…హైదరాబాద్‌ చుట్టూతా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వర్షం పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వాతావరణం మొత్తం చల్లబడింది. అయితే, ఉక్కపోత మాత్రం తీవ్రంగా ఉంది. మంగళవారం మూడు, నాలుగు డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు బుధవారం మాత్రం అదే స్థాయిలో పెరిగాయి. సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో అత్యధికంగా 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. సూర్యాపేట, ములుగు, ఖమ్మం, నిర్మల్‌, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరలో అత్యధికంగా 4.23 సెంటీమీటర్ల వర్షం పడింది. బుధవారం రాత్రి పది గంటల వరకు టీఎస్‌డీపీఎస్‌ నివేదిక ప్రకారం 41 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైతే…రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌ పరిధిలోనే 30కిపైగా ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముంది.