– చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం
– ఛేదనలో అభిషేక్, మార్‌క్రామ్ మెరుపులు
– చెన్నై 165/5, హైదరాబాద్ 166/4
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం సాధించింది. పసుపు సముద్రాన్ని తలపించిన ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానుల మద్దతు పొందినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చతికిల పడింది. శివం దూబె (45), అజింక్య రహానె (35) రాణించటంతో తొలుత సూపర్‌కింగ్స్ 165/5 పరుగులు చేసింది. ఛేదనలో ఎడెన్ మార్‌క్రామ్ (50), అభిషేక్ శర్మ (37), ట్రావిశ్ హెడ్ (31) చెలరేగటంతో 18.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్ లాంఛనం ముగించింది.
నవతెలంగాణ-హైదరాబాద్
ఉప్పల్ గడ్డ.. సన్‌రైజర్స్ అడ్డా. శుక్రవారం జరిగిన ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల ఛేదనలో ఎడెన్ మార్‌క్రామ్ (50, 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (37, 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రావిశ్ హెడ్ (31, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. మిడిల్ ఓవర్లలో చెన్నై సూపర్‌కింగ్స్ పోరాడినా.. హెన్రిచ్ క్లాసెన్ (10 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (14 నాటౌట్) ఆడుతూ పాడుతూ లాంఛనం ముగించారు. 18.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్ 166 పరుగులు చేసి సీజన్లో రెండో విజయం నమోదు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. హైదరాబాద్ పేసర్లు భువనేశ్వర్ కుమార్,పాట్ కమిన్స్, జైదేవ్ ఉనద్కత్‌లు ఆకట్టుకునే ప్రదర్శన చేయటంతో చెన్నై సూపర్‌కింగ్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. శివం దూబె (45, 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), అజింక్య రహానె (35, 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (31 నాటౌట్, 23 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు.
దంచికొట్టారు : ఛేదనలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (37) చెలరేగాడు. 12 బంతుల్లోనే సూపర్‌కింగ్స్‌ను వణికించాడు. పవర్‌ప్లేలో 3 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ హైదరాబాద్‌కు అదిరే ఆరంభాన్ని అందించాడు. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ ఛేదనలో ప్రతి దశలో ముందంజలోనే నిలిచింది. ట్రావిశ్ హెడ్ (31), ఎడెన్ మార్‌క్రామ్ (50) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. వరుస వికెట్లతో సూపర్‌కింగ్స్ బౌలర్లు కాస్త ఆశలు రేపినా.. షాబాజ్ అహ్మద్ (18), హెన్రిచ్ క్లాసెన్ (10 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్), నితీశ్ కుమార్ రెడ్డి (14 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అదరగొట్టారు. దీపక్ చాహర్‌పై స్ట్రయిక్ సిక్సర్ కొట్టిన నితీశ్ కుమార్ లాంఛనం ముగించాడు. విధ్వంసకారుడు హెన్రిచ్ క్లాసెన్ ఒక్క సిక్సరైనా కొట్టకుండానే ఇన్నింగ్స్‌ను ముగించాడు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ (2/23) రెండు వికెట్ల ప్రదర్శన చేశాడు.
దూబె మెరువగా : తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి శివం దూబె (45) మెరుపు ఇన్నింగ్స్‌తో మంచి స్కోరు అందించాడు. సహచర బ్యాటర్లు వేగంగా ఆడేందుకు ఇబ్బంది పడిన పిచ్‌పై దూబె నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (31 నాటౌట్), అజింక్య రహానె (35) రాణించారు. చివర్లో ఎం.ఎస్ ధోని (1 నాటౌట్) క్రీజులోకి వచ్చి ఉప్పల్ ఊగిపోయేలా చేశాడు. బౌండరీలేమీ కొట్టకపోయినా మహిని క్రీజులో చూసిన అభిమానులు సంబురాలు చేసుకున్నారు. చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. హైదరాబాద్ పేసర్లు సమిష్టి ప్రదర్శనతో చెన్నై బ్యాటర్లకు చెక్ పెట్టారు.
ఉప్పల్‌లో ఎల్లో సీ! : ఉప్పల్ స్టేడియం ‘పసుపు సముద్రాన్ని’ తలపించింది. ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన మహిని చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఉప్పల్ స్టేడియం పూర్తి సామర్థ్యం 33 వేలు కాగా.. శుక్రవారం మ్యాచ్‌కు ఏకంగా 35 వేల మంది హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, సినీ ప్రముఖులు మ్యాచ్‌కు హాజరయ్యారు. ఎం.ఎస్ ధోనికి హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు చార్మినార్ మెమెంటో బహూకరించి సత్కరించారు.