– కొలంబోలో వర్ష సూచనలే కారణం
– భారత్, పాక్ మ్యాచ్ ప్రతికూల ప్రభావం
నవతెలంగాణ-కొలంబో
వాతావరణ పరిస్థితులు క్రికెట్‌ను ఎల్లప్పుడూ శాసిస్తున్నాయి. ఎంతో సాంకేతికత అందుబాటులోకి వచ్చినా.. వరుణ గండం నుంచి గట్టెక్కే మార్గం అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ)కి చిక్కటం లేదు. ఆట, వినోదంతో పాటు వాణిజ్య విలువలు ముడిపడిన క్రికెట్.. అనూహ్య వాతావరణ మార్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారత్, పాకిస్థాన్ ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్ ఇందుకు చక్కటి నిదర్శనం. అంచనాల ప్రకారం, మ్యాచ్ ఆరంభానికి ముందు మాత్రమే వర్షం కురిసే సూచనలు కనిపించాయి. మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయినా, భారత ఇన్నింగ్స్‌లో రెండు సార్లు అంతరాయం కలిగించిన వర్షం.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభానికి అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఉత్కంఠరేపిన దాయాదుల సమరం ఫలితం తేలకుండా ముగిసింది. ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్‌కు ఇది తీరని నష్టం తీసుకొచ్చిందని సమాచారం. సూపర్ 4 దశ మ్యాచులకు సైతం వరుణ గండం ఉండటంతో.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించేందుకు.. వేదికలను మార్చేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది!.
కొలంబోకు వర్షం ముప్పు
సూపర్ 4 దశలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు కొలంబో వేదిక కానుంది. ఇక్కడి ఆర్. ప్రేమదాస స్టేడియం దాయాదుల సమరానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఆ రోజు సైతం వాతావరణం అనుకూలంగా లేదు. రానున్న వారం రోజుల్లో కొలంబోను వరుణుడు ముంచెత్తనున్నాడు. అదే జరిగితే.. ఆసియా కప్ ప్రసారదారుకు భారీ నష్టాలు మిగల్చటం ఖాయం!. అభిమానులూ తీవ్ర నిరాశకు లోనవుతారు. అందుకే.. సూపర్ 4 దశలో కొలంబోలో జరగాల్సిన మ్యాచులను దంబుల్లా, హంబన్‌టోట స్టేడియాలకు రీ షెడ్యూల్ చేయాలనే ఆలోచన నిర్వాహకుల్లో ఉంది. నాలుగు జట్లకు వసతి, బస సహా ప్రసారదారు, అభిమానుల ఏర్పాట్లు ఇప్పటికప్పుడు ఖాయం చేయటం అంత సులువు కాదు. కానీ, ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ వేదికల మార్పుకు పట్టుబట్టినట్టు ఏసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఓ టోర్నీ ఆరంభమైన అనంతరం.. షెడ్యూల్‌లో మార్పులు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. తొలిసారి ఆసియా కప్‌లో షెడ్యూల్‌ను టోర్నీ మధ్యలో మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
కాసుల కక్కుర్తి!
భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత జట్టు నిరాకరించగా… గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆసియా కప్‌ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఆతిథ్య పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సమ్మతించింది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మెగా మ్యాచ్ ద్వారా ఆదాయం ఆర్జించాలనే దురాలోచన శ్రీలంక క్రికెట్ బోర్డు చేసింది. దీంతో తొలిసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు స్టాండ్స్‌లో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సాధారణ స్టాండ్స్‌కు రూ.10000, గ్రాండ్ స్టాండ్స్‌కు రూ.42500 (శ్రీలంక రూపాయలు) వసూలు చేశారు. శ్రీలంకలో సాధారణ స్టాండ్స్ టికెట్ ధర రూ. 250, గ్రాండ్ స్టాండ్స్ టికెట్ ధర రూ.1250 మాత్రమే. కానీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సుమారు 80 రెట్లు అధిక ధరలకు టికెట్లను అమ్ముకున్నారు. అసలే ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. ఈ స్థాయిలో టికెట్ ధరలను నిర్ణయించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారని శ్రీలంక క్రికెట్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు సైతం స్టేడియంలో పెద్దగా అభిమానులు కనిపించలేదు. అందుకు సైతం అధిక టికెట్ ధరలే కారణం.