బ్రేక్ ఫాస్ట్ కు సూప‌ర్ ఆప్ష‌న్స్

Super options for breakfastబ్రేక్‌ ఫాస్ట్‌ అంటే అందరికీ గుర్తుకు వచ్చేవి ఇడ్లీ, ఉప్మా, దోశ, పూరీ… ఇవే. సాధారణంగా అన్ని ఇండ్లల్లో ఇవే ఉంటాయి. అయితే పిల్లలు ఏదైనా కొత్తగా కోరుకుంటారు. వాళ్ల కోసం హెల్దీగా ఏం చేయాలి అనే ఆలోచన రావడం సహజం. అలాంటి వారి కోసమే ఈ వెరైటీ హెల్దీ బ్రేక్‌ ఫాస్ట్‌లు. పిల్లలే కాదు ఇంటిల్లి పాదీ లొట్టలేసుకొని మరీ తినాల్సిందే. మరి అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు ఏంటో, వాటిని ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం…
పోహా
కావాల్సిన పదార్ధాలు: అటుకులు – ఒకటిన్నర కప్పు, నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు, పల్లీలు – మూడు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – టీ స్పూన్‌, జీలకర్ర – టీ స్పూన్‌, ఎండు మిర్చి – రెండు, కరివేపాకు రెబ్బలు – రెండు, ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి (సన్నని తరుగు) – రెండు, క్యారట్‌ తరుగు – పావు కప్పు, కాప్సికం తరుగు – పావు కప్పు, టమాటా సన్నని తరుగు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావు టీ స్పూను, ఫ్రోజెన్‌ బఠాణీ – పావు కప్పు, మొలకలు – అర కప్పు, పంచదార – పావు టీ స్పూను, నీళ్లు – నాలుగు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – టేబుల్‌ స్పూను.
తయారీ విధానం: ముందుగా అటుకులని జల్లించకుని నీళ్లతో తడిపి జల్లెడలో వదిలేయండి. తర్వాత స్టౌ ఆన్‌ చేసి నూనె వేడి చేసి అందులో పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి. అందులోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా మారిన తర్వాత అందులో క్యారట్‌, కాప్సికం ముక్కలు వేసి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత బఠాణీ, మొలకలు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూతపెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు తడిపిన అటుకులు వేసి చిదిరిపోకుండా బాగా కలపాలి. ఆ తర్వాత పంచదార వేసి కలిపి మూకుడు అంచుల వెంట నీళ్లు పోసి కదపకుండా మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. మూత తీసి నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే హెల్దీ స్ప్రౌట్స్‌ పొహ రెడీ!
మరమరాల వడలు
కావాల్సిన పదార్థాలు: మరమరాలు – ఒకటిన్నర కప్పులు, ఉల్లిగడ్డ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు- రుచికి సరిపడా, కారం – అర టీ స్పూను, గరం మసాలా – పావు టీ స్పూను, ధనియాల పొడి – పావు టీ స్పూను, జీలకర్ర పొడి – పావు టీ స్పూను, అల్లం పేస్టు – అర టేబుల్‌ స్పూను, బియ్యం పిండి – రెండు చెంచాలు, మైదా – రెండు చెంచాలు
తయారీ విధానం: ముందుగా మరమరాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి ఐదు నిమిషాలు పక్కకు పెట్టాలి. ఈ లోపు ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా కట్‌ చేసి పక్కకు పెట్టుకోవాలి. మరమరాలు నానిన తర్వాత నీళ్లు లేకుండా పిండుకుంటూ ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా మరమరాలను మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి.
అందులోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యప్పిండి, మైదా వేసుకోవాలి. మైదా ఇష్టం లేకపోతే దాని బదులు శనగపిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం మరమరాలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ మరమరాలను ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మరమరాల మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ఉండలాగ చేసి అరచేతిలో పెట్టి వడలుగా ఒత్తుకుని ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా మరమరాల మిశ్రమాన్ని మొత్తం వడలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాలిన తర్వాత ముందే సిద్ధం చేసుకున్న వడలను నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసిన వడలన్నింటినీ నూనెలో వేసి కాల్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల వడలు రెడీ. కేవలం నిమిషాల్లోనే ప్రిపేర్‌ చేసుకునే ఈ వడలను ఏదైనా చట్నీతో లేదా విడిగా తిన్నా రుచిగా వుంటాయి. నచ్చితే మీరూ ట్రై చేసుకోండి.
ఓట్స్‌ పకోడీ
కావాల్సిన పదార్థాలు: గుప్పెడు – జీడిపప్పులు, ఒక కప్పు – ఓట్స్‌, రెండు – ఉల్లిగడ్డలు, పావు కప్పు – శనగపిండి, పావు కప్పు – బియ్యప్పిండి, మూడు – పచ్చిమిర్చి, గుప్పెడు – కరివేపాకు, కొద్దిగా – కొత్తిమీర తరుగు, అరటీస్పూన్‌ – గరంమసాలా, పావుటీస్పూన్‌ – పసుపు, తగినంత – కారం, కొద్దిగా – అల్లంవెల్లుల్లి పేస్ట్‌, రుచికి సరిపడా – ఉప్పు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఓట్స్‌ను తీసుకొని అవి పూర్తిగా నిండిపోయేలా కాకుండా సగం వరకు మాత్రమే నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అవి నానేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిలను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్‌ చేసుకొని పక్కనుంచాలి. ఓట్స్‌ చక్కగా నాని మెత్తగా అయ్యాయనుకున్నాక నీళ్లు వడకట్టి వాటిని ఒక మిక్సింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి యాడ్‌ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి తరుగు వేసుకొని మరోసారి చక్కగా మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, సన్నగా తరుక్కున్న జీడిపప్పు పలుకులు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, కారం, పసుపు, గరంమసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ ఇలా మిగతా పదార్థాలన్నీ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్‌ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ యాడ్‌ చేసుకొని పకోడీ పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టుకొని ఆయిల్‌ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఓట్స్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని పకోడిల్లా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌ మీద అన్ని వైపులా పకోడీ చక్కగా కాలేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా వేగి, గోల్డెన్‌ కలర్‌లోకి వచ్చాయనుకున్నాక వాటిని తీసి టిష్యూ పేపర్‌ పరచిన ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా టిష్యూ పేపర్‌ అదనపు నూనెను పీల్చేస్తుంది. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే చాలు.
అరటి కోలా బాల్స్‌
కావాల్సిన పదార్థాలు: అరటికాయలు – రెండు, పల్లీలు – కప్పు, కొబ్బరి తురుము – పావు కప్పు, అల్లం – అంగుళం ముక్క, పచ్చిమిర్చి – రెండు, కారం – టేబుల్‌ స్పూను, పసుపు – పావు చెంచా, సోంపు – పావు చెంచా, ఇంగువ – చిటికెడు, సన్నని ఉల్లిగడ్డ తరుగు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – చారెడు, కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ముందుగా అరటికాయల చివర్లు కట్‌ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చుకొని తొక్క తీసి తురుముకొని పక్కనుంచాలి. అలాగే ఉల్లిగడ్డలను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టుకొని పల్లీలను వేసి వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, సోంపు, కారం, ఇంగువ, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత వెడల్పాటి మిక్సింగ్‌ బౌల్‌ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమం, అరటికాయ తురుము, ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, కొబ్బరి తురుము వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నుంచి కొద్దికొద్దిగా పిండిముద్దను తీసుకొని నిమ్మకాయంత సైజ్‌లో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్‌ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆ ఉండలను కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే టేస్టీ అరటి కోలా బాల్స్‌ రెడీ. వీటిని చట్నీ లేదా సాస్‌తో తింటే సూపర్‌గా ఉంటాయి.