సూపర్‌ సబలెంక

సూపర్‌ సబలెంక– క్వార్టర్‌ఫైనల్లో సబలెంక, రిబకినా
– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2024
పారిస్‌ (ఫ్రాన్స్‌) : ఫ్రెంచ్‌ ఓపెన్‌లో బెలారస్‌ భామ, రెండో సీడ్‌ సబలెంక సూపర్‌ షో కొనసాగుతుంది. మహిళల సింగిల్స్‌ నాల్గో రౌండ్‌లో 6-2, 6-3తో సబలెంక అలవోక విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణి ఎమ్మా నవ్వారోపై వరుస సెట్లలో గెలుపొందింది. ఏడు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో సబలెంక అదరగొట్టింది. పాయింట్ల పరంగా 64-41తో సబలెంక తిరుగులేని ఆధిపత్యం చూపించి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. కజకిస్థాన్‌ క్రీడాకారిణి ఎలెనా రిబకినా సైతం క్వార్టర్స్‌కు చేరుకుంది. 6-4, 6-3తో ఉక్రెయిన్‌ అమ్మాయి ఎలినా స్విట్లోనాపై వరుస సెట్లలో విజయం సాధించింది. ఐదు ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించిన రిబకినా క్వార్టర్‌ఫైనల్లో జేస్మిన్‌తో తలపడనుంది. ఇటలీ అమ్మాయి జేస్మిన్‌ 4-6, 6-0, 6-1తో ఎలినాపై మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. మహిళల క్వార్టర్‌ఫైనల్లో నేడు కొకొ గాఫ్‌తో, జేబుర్‌.. ఇగా స్వైటెక్‌తో ఒండ్రుసోవా తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ జానిక్‌ సినర్‌ (ఇటలీ) 2-6, 6-3, 6-2, 6-1తో మౌటెట్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపాడు.