– క్వార్టర్‌ఫైన్లలో పొలాండ్ భామ
– సినర్, అలెక్స్ సైతం ముందంజ
– యు.ఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2024
పొలాండ్ భామ, టాప్ సీడ్ ఇగా స్వైటెక్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. యు.ఎస్ ఓపెన్‌లో గతంలో క్వార్టర్స్‌కు చేరుకున్న సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన ఇగా స్వైటెక్.. అదే ప్రదర్శన ఈ సీజన్‌లోనూ పునరావతం చేసేందుకు సిద్ధమవుతోంది. మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫైట్ సైతం ఆసక్తికరంగా మారింది. జానిక్ సినర్, అలెక్స్‌లు పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు.
నవతెలంగాణ-న్యూయార్క్
వరల్డ్ నం.1, టాప్ సీడ్ ఇగా స్వైటెక్ (పొలాండ్) యు.ఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. సూపర్ ఫామ్ కొనసాగించిన స్వైటెక్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ నం.16 సమ్సోనోవపై వరుస సెట్లలో విజయం సాధించింది. సుమారు గంటన్నర పాటు సాగిన పోరులో 6-4, 6-1తో స్వైటెక్ అలవోక విజయం సాధించింది. వరుస సెట్లలో మూడు బ్రేక్ పాయింట్లు సాధించిన టాప్ సీడ్.. ప్రత్యర్థి సమ్సోనోవకు ఒక్క బ్రేక్ పాయింట్‌ను సైతం కోల్పోలేదు. మూడు ఏస్‌లతో మెరిసిన స్వైటెక్ పాయింట్ల పరంగా 63-45తో ఎదురులేని విజయం సాధించింది. స్వైటెక్ 12 గేమ్ పాయింట్లు సాధించగా.. సమ్సోనోవ ఐదు గేమ్ పాయింట్లకే పరిమితమైంది. తొలి సర్వ్‌లోనే 88 శాతం పాయింట్లు గెల్చుకున్న స్వైటెక్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గతంలో యు.ఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నప్పుడు పొలాండ్ భామ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. బ్రెజిల్ భామ హదాద్ సైతం మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. కరొలినా వొజ్నియాకిపై మూడు సెట్ల సమరంలో పైచేయి సాధించింది. 6-2, 3-6, 6-3తో వొజ్నియాకిపై హదాద్ గెలుపొందింది. ఐదు ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో చెలరేగిన హదాద్.. వొజ్నియాకి నిలకడగా పోటీనిచ్చినా నిలబడింది. వొజ్నియాకి సైతం నాలుగు ఏస్‌లతో పాటు మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 101-88తో హదాద్ ఆధిపత్యం నిరూపించుకుంది. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో స్వైటెక్‌తో జెస్సికా పెగులా..కరొలినా ముచోవాతో హదాద్.. సబలెంకతో జెంగ్..ఎమ్మా నవారాతో బడోసలు తలపడనున్నారు.
సినర్ ముందంజ :
పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్లు నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాస్‌లు ఇంటిముఖం పట్టగా.. టాప్ సీడ్, వరల్డ్ నం.1 జానిక్ సినర్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు, 14వ సీడ్ టామీ పాల్‌పై 7-6(7-3), 7-6(7-5), 6-1తో సినర్ సూపర్ విక్టరీ నమోదు చేశాడు. తొలి రెండు సెట్లు టైబ్రేకర్‌కు దారితీయగా.. మూడో సెట్‌లో సినర్ తనదైన క్లాస్ చూపించాడు. 10 ఏస్‌లు కొట్టిన సినర్.. నాలుగు బ్రేక్ పాయింట్లతో మెరిశాడు. సుమారు మూడు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో సినర్ పాయింట్ల పరంగా 116-93తో పైచేయి సాధించాడు. ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు తలపడిన మరో మ్యాచ్‌లో అలెక్స్ విజయం సాధించాడు. 6-0, 3-6, 6-3, 7-5తో జొర్డాన్ థామ్సన్‌పై సాధికారిక విజయం సాధించాడు. తొలి సెట్‌ను ఏకపక్షంగా నెగ్గిన అలెక్స్‌కు తర్వాత వరుసగా మూడు సెట్లలో గట్టి పోటీ ఎదురైంది. రెండో సెట్‌ను జొర్డాన్‌కు కోల్పోయినా.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో అలెక్స్ ైచేయి సాధించాడు.