మధ్యప్రదేశ్‌ టూ హైదరాబాద్‌ డ్రగ్స్‌ సరఫరా

– ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్‌
– రూ.45 లక్షల ఎండీఏంఏ డ్రగ్స్‌, ముడిసరుకు పట్టివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
మధ్యప్రదేశ్‌ టూ హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను రాచకొండ ఎస్‌వోటీ, జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10గ్రాముల ఏండీఏంతోపాటు 40కిలోల మాదకద్రవ్యాల (గసగసాల గడ్డి) ముడిసరుకు, రూ.10వేలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.45లక్షలుంటుందని సీపీ తెలిపారు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెళ్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ఓమా రామ్‌, సన్వాలారామ్‌ కార్పెంటర్‌, రైలింగ్‌ వర్క్‌ చేస్తుండేవారు. జల్సాలకు అలవాటుపడిన నిందితులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో సులువుగా డబ్బులు సంపాదించాలని భావించి డ్రగ్స్‌ను విక్రయించాలని పథకం వేశారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మాదకద్రవ్యాలను సరఫరా చేసే వికాస్‌ అలియాస్‌ ముఖేష్‌ను కలిశారు. అతని సహాయంతో ఎండీఏంఏ డ్రగ్స్‌తోపాటు మాదక ద్రవ్యాలను తయారు చేసే ముడిసరుకు(గసగసాల గడ్డి)ని కొనుగోలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న నిందితులు అక్కడి నుంచి బస్సులు, లారీలు, ఆటోలు, ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తెలిసిన వారికి, స్నేహితులతోపాటు కావాల్సిన వారికి అధిక ధరలకు డ్రగ్స్‌ విక్రయిస్తున్నారు. జవహర్‌నగర్‌ సమీపంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు.. స్థానిక పోలీసులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిం చారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వికాస్‌ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్‌ను కొనుగోలు చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరిం చారు. విద్యార్థులు, యువ కులు డ్రగ్స్‌ జోలికెళ్లొద్దని సూచిం చారు. మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే 10సంవత్సరాలకుపైనే జైలు శిక్ష పడుతుందన్నారు.
సమాచారం ఇవ్వండి.. అవార్డు అందుకోండి..
డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీపీ సుధీర్‌బాబు అన్నారు. ఎక్కడైనా డ్రగ్స్‌ విక్రయించినా, సరఫరా చేస్తున్నట్టు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, వారికి ప్రొత్సా హకరంగా అవార్డు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌వోటీ డీసీపీ కె.మురళీధర్‌, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ బాస్కర్‌రెడ్డి, జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తదితరులు ఉన్నారు.