– వాహనాల ద్వారా కిరాణా, బెల్లు షాపులకు పంపిణీ
– మామూలుగా తీసుకుంటున్న అధికారులు
నవతెలంగాణ-జైపూర్
ఈ ఫోటోలో కన్పిస్తున్న వాహనం.. మద్యం తరలిస్తూ జైపూర్ మండలం కిష్టాపూర్‌లో ఇటీవల కన్పించింది. హోల్‌సేల్ వ్యాపారులు గ్రామాల్లోని కిరాణ షాపులకు నిత్యవసర సరుకులు తరలించే విదంగా వైన్స్ షాపుల యజమానులు వాహనాల ద్వారా మద్యం తరలిస్తున్నట్లు బహిర్గతమైంది. కిరాణ వస్తువులు తరలించినట్లు మద్యం షాపుల వారు కూడా వాహనాల ద్వారా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక్క కిష్టాపూర్ మాత్రమే కాదు మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలకు మద్యం సరఫరా చేస్తూ అందరికి అందుబాటులో మందు అన్నట్లుగా వైన్ షాపుల వారి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతోంది. ఈ విధంగా సరఫరా అవుతున్న మద్యం ప్రతి గ్రామంలో బెల్టు షాపులు, కిరాణ షాపుల్లో అందుబాటులో ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మండల కేంద్రంలో గల వైన్ షాపుతో పాటు ఇందారం గ్రామంలో గల వైన్ షాపుల ద్వార ఊరూరా మద్య సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అనుమతిచ్చిన ఈ రెండు వైన్ షాపుల ద్వార విచ్చల విడిగా గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులకు ప్రత్యేక వాహనాలతో యదేచ్ఛగా మద్యం సరఫరా చేస్తున్నారు. మండల పరిధిలో అనుమతి పొందిన రెండు వైన్ షాపులు ఒక్కరి నిర్వాహణలో కొనసాగుతుండగా ఇక్కడి నుంచి గ్రామ పంచాయతీలకు మధ్యం తరలిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మందు తరలిపోతుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. మిట్ట మధ్యాహ్నం మద్యం తరలిస్తున్న తీరును ఫోటోలు తీసినా.. వీడియోలు తీసినా మాకేం ఇబ్బంది లేదు అన్నట్లుగా వారి పని వారిదే తప్పా ఇతరులను పట్టించుకోరు. రోజు విడిచి రోజు ఇందారం, జైపూర్ వైన్ షాపుల నుండి ప్రత్యేక వాహణాల ద్వార మండల పరిధిలో మద్యం సరఫరా చేస్తున్నారు. పండుగలు, పెండ్లీలు ఉన్న రోజుల్లో రోజు వారిగా మద్యం సరఫరా అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
పట్టించుకోని సంబంధిత అధికారులు
మండంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం అన్ని చోట్ల సాగుతుందని మామూలుగా తీసుకుంటున్నారు. వైన్ షాపు యజమానులు నిబందనల మేరకు విక్రయాలు సాగించాల్సి ఉంటుంది. కాని అధికారుల సహకారంతో మంలంలో విచ్చలవిడి మధ్యం విక్రయాలు సాగుతున్నా అధికరులు మాత్రం బెల్టు షాపులు అనేటివి చాటుమాటున నడిపించే వ్యవహరమని, తమ దృష్టికి వస్తేనే చర్యలు తీసుకుంటామని చెప్పుకోవడం కొసమెరుపు.
వాహనాల్లో తరలించడం సరికాదు
అనీషా రాథోడ్, ఎక్సైజ్ ఎస్‌ఐ
వైన్ షాపు యజమానులు వాహనాల్లో మద్యం తరలించడం సరికాదు. అలాంటివి తమ దృష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. ఎక్కువ మొత్తంలో మధ్యం తరళిస్తే వాటిని సీజ్ చేస్తాం. బెల్టు షాపుల నిర్వాహణ విషయంలో పై అధికారుల దృష్టికి తీసుకువెల్తాము. అవసరమైన ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని సీజ్ చేసి సదరు నిర్వాహకులపై కేసులు పెడతాం.