బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదరించండి

బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదరించండి– ఖమ్మంలో ఉద్యోగుల ర్యాలీ
నవతెలంగాణ- ఖమ్మం
ప్రయివేటు టెలికం సంస్థలు మొబైల్‌ ఛార్జీలను విపరీతంగా పెంచి వినియోగదారులపై భారాన్ని మోపాయని బిఎస్‌ఎన్‌ఎల్‌ డిజిఎం దుంపల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, ఉద్యోగులు, ప్రాంఛైజీలు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థయైన బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలపై ఎటువంటి అదనపు భారాన్ని మోపడం లేదని ఆయన తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వరంగ సంస్థ అని దానిని పరిరక్షించడం భారతీయ పౌరుని బాధ్యత అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ రీఛార్జ్‌ ధరలను పెంచబోదని ఆయన స్పష్టం చేశారు. రూ.199లకే రీఛార్జ్‌ 2జిబి డేటాను నెలకు అందిస్తున్నామని, రూ.249లతో రీఛార్జ్‌ చేసుకుంటే 2జిబి డేటాతో పాటు ఆన్లిమిటెడ్‌ కాల్స్‌, 45 రోజుల వ్యాలిటీని వినియోగించుకోవచ్చునన్నారు. ఖమ్మం జిల్లాలో 2జి, 3జి కలుపుకుని మొత్తం 390 టవర్లు ఉన్నాయని, వీటితో పాటు 47 4జి టవర్లు రాబోతున్నాయని తెలిపారు. ఆగష్టు నాటికి ఖమ్మం జిల్లాలో 4జి నెట్వర్క్‌ పనిచేయడానికి బిఎస్‌ఎన్‌ఎల్‌ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, 15 రోజుల వ్యవధిలోనే 10వేల మంది ప్రైవేట్‌ టెలికం సంస్థల నుండి బిఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ కస్టమర్లుగా రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ర్యాలీలో ఏజిఎం సుష్మా, గోవింద్‌, రామ్కుమార్‌, సుధీర్‌, శ్రీనివాసరావు, కేలోత్‌ రాంబాబు, యూనియన్‌ నేతలు దుర్గారావు, సాంబశివరావు, పున్నారావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.