– 7 న జరిగే బీసీ సదస్సులో ప్రధాని ప్రకటించాలి
– లేకుంటే 9న భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం : బీసీ వెల్ఫేర్ సోసియేషన్ జాతీయ అధ్యక్షులు జాజుల
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
బీసీ ముఖ్యమంత్రితో పాటు బీసీల కుల గణన, దామాషా ప్రకారం రిజర్వేన్లు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రకటిస్తేనే బీజేపీకి మద్దతిస్తామని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ మేధో మదన సదస్సులో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ 23, కాంగ్రెస్ 20 స్థానాల్లో మాత్రమే బీసీలకు టికెట్లు కేటాయించాయని విమర్శించారు. ఒకటి అర శాతం ఉన్న సామాజిక తరగతులకు మెజార్టీ సీట్లు ఇచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడుతామని చెబుతున్న రాహుల్ గాంధీ మాటలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్‌లో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దిక్కులేదని విమర్శించారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ 7న హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ సదస్సులో ప్రధాని స్పష్టమైన హామి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 9న భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.