ధాన్యానికి మద్దతు ధర ఇప్పిస్తా

Support price for grains– రైతులు తొందరపడి తక్కువ ధరకు విక్రయించొద్దు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
– కొనుగోలు కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ-సిద్దిపేట
ధాన్యానికి రూ.2203 మద్దతు ధర ఇప్పిస్తానని.. రైతులెవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలం పెద్దకోడూర్‌ గ్రామ పరిధిలోని మెట్టు బండల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడొద్దని.. తొందర పడి తక్కువ ధరకు విక్రయించొద్దని తెలిపారు. అధికారులతో మాట్లాడి.. రైతులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వెంటనే అడిషనల్‌ కలెక్టర్‌, ఆర్డివో, డీఎం సివిల్‌ సప్లై ఐకేపీ అధికారులతో మాట్లాడి.. వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని కోరారు. కాగా గత 15 రోజుల నుంచి వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయంటూ రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చి వాపోయారు. పనులన్నీ విడిచిపెట్టుకుని ఈ వడ్ల దగ్గరే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని నష్టాలకు తట్టుకున్నా.. ఇటీవలే కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందని వాపోయారు. కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఇన్ని రోజులవుతున్నా.. ఎందుకు కొనడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక పంటలు ఓ పక్క ఎండిపోతున్నాయని.. మరోపక్క చేతికందిన పంటలు నీటి పాలవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ హయాంలో ఇలాంటి కష్టాలు లేవన్నారు. అనంతరం పలువురు రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రగునవ్వ అనే రైతు మాట్లాడుతూ.. 15 రోజుల నుండి ఇక్కన్నే ఉంటున్నాం. కొనే నాథుడే లేడు.. కేసీఆర్‌ ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు.. ఇప్పుడు ఏం లేవు అంటూ వాపోయారు. మోహన్‌ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. కరెంట్‌ తిప్పలతో రెండు సార్లు నా మోటార్‌ కాలింది. అందుకు అక్షరాలా రూ.22 వేలు అయింది. రైతు బంధు కూడా ఇవ్వలేదు. ఏది లేదు సార్‌.. మాకు తిప్పలు అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.