కుందూర్ రఘువీర్ రెడ్డి కే మాలల మద్దతు

– ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కాంగ్రెస్ ను  గెలిపించాలి
– కులాల అభివృద్ధికి కార్పొరేషన్ లను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ దే
– రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి పెద్దలే చెప్పడం సిగ్గుచేటు
– మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి. చెన్నయ్య
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
లోక్  సభ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు  రఘువీరారెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాల  ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ల రిజర్వేషన్లను తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మార్చివేస్తామని  ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలంటే కేంద్రంలో బిజెపిని గద్దేధించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సోమవారం  నల్గొండ జిల్లా కేంద్రం లోని బస్టాండ్ సమీపంలో గల  సవేర హోటల్ లో జిల్లా అధ్యక్షులు లకుమాల మదు బాబు  అధ్యక్షతన మాల మహానాడు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం  జరిగింది. ఈ సమావేశానికి  ముఖ్య అతిథిగా హాజరైన మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని దళిత, బహుజనులకు విజ్ఞప్తి చేశారు.  బిజెపి పాలనలో దళిత, గిరిజన, మైనార్టీలతోపాటు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారిపై దాడులు నిత్యం జరుగుతున్నాయని ఆవేదన చెందారు. ఈ దేశ మెజారిటీ ప్రజలకు రక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దళితులకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లతో పాటు అన్ని కులాల అభివృద్ధికి కార్పొరేషన్ లను ఏర్పాటు చేశారని, దళిత బహుజనులు మరింత అభివృద్ధిలోకి రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని  చెన్నయ్య పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజి రమేష్, మన్నె శ్రీదర్ రావు, మళ్ళికంటి శ్రీనివాస్, వినయ్ కుమార్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.