1927 డిసెంబర్ 25న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులు బిఆర్ మోరెతో కలిసి మహారాష్ట్రలోని మహద్ పట్టణం చౌదారు చెరువు మంచినీళ్ల పోరాటం సందర్భంగా మనుస్మృతి గ్రంథాన్ని దహనం చేశాడు. నేటికీ సరిగ్గా 97 సంవత్సరాలు. ఆనాడే మనుస్మృతిని దహనం చేయాలనే ఆగ్రహం అంబేద్కర్ ఎందుకు వచ్చింది? అసలు మనుస్మృతిలో ఏముంది? అది ఎవరి ప్రయోజనాల కోసం రాయబడింది? నేటికీ మెజార్టీ ప్రజలు ఎందుకు దాన్ని అనుసరిస్తున్నారు? అది ఈ దేశ ప్రజల పైన ఏ రకమైన ప్రభావాలు చూపిందన్న అంశాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది.
ఆర్యుల రాకతో ప్రారంభమైన ఈ వర్ణధర్మం దేశంలో వృత్తులకు బిగించడం ద్వారా ఏర్పడ్డ కుల వ్యవస్థను బ్రిటిష్ వాళ్లరాకతోనే అంటరానితనం వచ్చిందని పలు రకాల చర్చలు ముందుకొస్తున్నాయి. కానీ ఇందులో అణువంత నిజం లేదు. వాల్మీకి రామాయణంలో చాకలి, మంగలిని పిలిచి సీతాదేవికి శీలపరీక్ష పెట్టారని అని రాశారు. అప్పటికే కులవ్యవస్థ ఉందని ఒప్పుకున్నట్లే కదా. కులవ్యవస్థకు వేల ఏండ్లు. బ్రిటీష్ వాళ్ల రాకకు కేవలం మూడువందల ఏండ్లు. వేల ఏండ్లుగా ఊరికి బయట అస్పృశ్యులుగా, అంటరాని వాళ్లుగా సాటి మనుషులుగా గుర్తించబడని నీచపు సంస్కృతి ఎందుకు కొనసాగుతుంది? ఈ నేరాలు అన్ని మనుస్మృతి మూలాలు కాక మరే మిటి? ఈ మానసిక చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దబడ్డాయి. ‘మనుస్మృతి అంటే దేవుడు సృష్టించిన గ్రంథం, దీనిని అం దరూ అమలు చేయాలి.లేకపోతే దేవుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’ అని విస్తృతంగా ప్రజల మెదళ్లను కలుషితం చేశారు.
మనుస్మృతిలో సుమారు 2500 శ్లోకాలు, ఎనిమిది కీలక అధ్యాయాలు ఉన్నాయి. సహజంగానే మనిషి మరణించినప్పుడు ‘ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామే యుగేయుగే’ అనే శ్లోకం వినిపిస్తుంది. ఆ శ్లోకంలోని పరమార్థం ఏమిటంటే ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మాత్రమే సర్వహక్కులు, సకల సంపదల్లో భాగస్వామ్యం ఉండాలి. శూద్రులు అణిచివేతకు సంపదలేమికి ప్రకృతి వనరుల్లో ప్రాతినిధ్యం ఉండకుండా నిత్యం అవమానించబడుతూ ఉండాలి. ఇదే మనుధర్మ శాస్త్రం. ఇందులో ధర్మమే లేదు. సనాతన ధర్మమైన, మనుధర్మమైన, వేదాలు, ఉపనిషత్తులు ఏమిచెప్పిన అవన్నీ శూద్రులను అస్పృశ్యులను మహిళలను అణిచివేయటం కోసం ఏర్పాటు చేసుకున్నవే. వాటివల్ల మెజారిటీ ప్రజలకు హక్కులు నోచుకోక సంపదలో, భూమిలో, చదువులో, ఆభరణాల్లో, ఆయుధాల్లో, అధికారాల్లో భాగస్వామ్యం లేకపోవడంతో మనదేశం అనేక దేశాల కంటే వెనుకబడి ఉంది. నేడు ప్రపంచ ఆకలిసూచికలో మన దేశం 111వ స్థానంలో ఉంది. మానవాభివృద్ధి సూచికలో 131వ స్థానం. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపదలో వారికి సహజ న్యాయం జరగకపోవటమే అనేది గుర్తించాలి.
మనుస్మృతిపై నేడు అనేక సైద్ధాంతిక సంఘర్షణలు సాగుతున్నాయి. ప్రాచీన భారత రాజ్యాంగం మనుధర్మ శాస్త్రం అనే వాదనలు సాగుతున్నాయి. ప్రత్యేకించి ఆరెస్సెస్ గొంతుకలో నుండి ఇవి తరచూ వినిపిస్తున్నాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో దాదాపు మూడువేల ఏండ్ల కిందట రాసిన ఈ మానసిక చట్టాలు నేటికి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. మనుస్మృతి కాగితాల్లో గీసిన అక్షరం కాదు మనుషుల మెదళ్లలో నిర్మితమై ఉన్న మనుధర్మం. భారతదేశంలో ప్రతి పౌరుడిని పరోక్షంగా నడిపిస్తున్న సూత్రాలవి. వాటి వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేర్చబడ్డాయి? అంటే అది రాసిన వారికి మాత్రమే అనేది విధితమవుతుంది. మనుధర్మం అంటే బ్రాహ్మణ ధర్మం, ఆధిపత్య ధర్మం, అణిచివేసే ధర్మం, మెజారిటీ ప్రజలకు సర్వహక్కులు లేకుండా చేసే అధర్మశాస్త్రం. కులపరమైన హెచ్చుతగ్గులకు అదే మూలం. నిచ్చెనమెట్ల కులవ్యవస్థను నేటికీ పెంచి పోషిస్తూ సుస్థిరం చేయడమే కాదు, కొనసాగిస్తున్నది కూడా అదే అధర్మం. చాతుర్వర్ణ వ్యవస్థలో మూడు వర్ణాల ప్రయోజనాల కోసం (బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య) ఆధిపత్యం కోసం శూద్రులను అణిచివేయటం, అవమానించడం కోసం ఉద్దేశించబడ్డవే. అదే నేడు ఈ దేశ సామాజిక వ్యవస్థను నడిపిస్తున్నది.ఇటీవల కాలంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ ‘దేహానికి కాళ్లు రెక్కలు ఎలా ఉంటాయో, కుల వ్యవస్థ కూడా అలాగే ఉండాలి. ఎవరు చేసే పని వాళ్లు చేయాలి’ అని సెలవిచ్చారు. అంటే దేశాన్ని తిరోగమన వైపు లాక్కెళ్లే హక్కు వీరికి ఎవరిచ్చారు?
మనుస్మృతిలోని కొన్ని శ్లోకాలను పరిశీలిస్తే ఆశ్చర్యమేస్తుంది. ‘శూద్రులు విద్యను అభ్యసించరాదు.చదివితే నాలిక కోయాలి. వింటే చెవుల్లో సీసం పోయాలి’ అని పేర్కొనబడింది. శూద్రుడైన శంభూకుడు వేదపఠనం చేశాడని రాముడు శంభూకుడి తల నరికిన దీనగాధ తెలిసిందే. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ను సైతం తరగతి గదిలో కూర్చోనివ్వలేదు. ఈ రకమైన మానసిక చట్టాలన్నీ ఈ దేశంలో నూటికి ఎనభైశాతం మంది ప్రజలను ప్రకృతి, సహజ వనరులకు సంబంధం లేకుండా అణిచివేతకు అవమానాలకు గురిచేసింది మనువాదం. ఊరికి బయట ఉన్న అస్పశ్యులు మూతికి ముంత.. ముడ్డికి తాటాకు కట్టుకొని రోడ్డుపై నడవాలని చెప్పింది. పట్టపగలు మాత్రమే గ్రామంలోకి రావాలి.తన నీడ తన మీదే పడాలి. ఇలాంటి దుర్మార్గపు శాసనాలు ఈ దేశాన్ని ఎంతగా పీడిం చాయో, ఎన్ని తరాలు అన్నింటికీ నోచుకోకుండా అవస్థలు పడ్డాయో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్లు పొడుస్తోంది. శవాలను కాల్చడం, వాటిని పూడ్చడానికి బొందలు తీయడం, సచ్చిన పశువుల్ని తీసుకెళ్లి తోలువలచి చర్మంతో చెప్పులు కుట్టడం, మురికి కాలువలు, పాయఖానలు శుభ్రం చేయడం, తరతరాలుగా ఒక తరగతికి మానసిక చట్టబద్ధత కల్పించడం, ఎంతటి దుర్మార్గపు చర్యనో ఆలోచించండి.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఏర్పడటం ద్వారా అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించడం, విద్యా,ఉద్యోగ, రాజకీయ పదవులలో రిజర్వేషన్లు కల్పించడం జరిగాయి.అలాగే ప్రభుత్వ రంగంలోనే అవకాశాలు పెరగటం, హరిత విప్లవ వ్యవసాయ రంగంలో వచ్చిన సంస్కరణలతో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి తీసుకొచ్చిన భూసంస్కరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చినటువంటి సమూలమైన మార్పులు అట్టడుగు తరగతుల జీవితాల్లో వెలుగులు నింపాయి. కానీ, ప్రభుత్వ రంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ల వల్ల ఎంతో కొంత మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్న అట్టడుగు వర్గాలు నేడు అభద్రతలో జీవిస్తున్నాయి. ప్రభుత్వరంగమే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. పదేళ్లుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కార్ తమ మనువాద ఎజెండాను అమలు చేస్తూ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇటీవల పార్లమెంటు సాక్షిగా భారతరత్న అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయన గొంతులో నుండి అకస్మాత్తుగా ఊడిపడిన పదాలు కాదు. ఆరెస్సెస్-బీజేపీ సుదీర్ఘకాలంగా వాళ్లు అనుసరించిన విధానంలో అంతర్భాగమే.
రాజ్యాంగ రూపకల్పన జరుగుతున్న సమయంలోనే ఆరెస్సెస్,జనసంఘ్ ఏర్పడి ఉన్నప్పటికీ అంబేద్కర్ అంటరాని వాడని, అతను రాసిన రాజ్యాంగాన్ని అంగీకరించకూడదనే వాదన తీసుకొచ్చింది.1949 నవంబర్ 26 రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించింది.’వివిధ దేశాల నుంచి అంబేద్కర్ అరువు తెచ్చిన అతుకులబొంత రాజ్యాంగం ఇది. దేశ ప్రజల సాంస్కృతిక జీవనానికి పనికిరానిది’ అని నాటి సంఘ్ నేతలుగా ఉన్న ఎమ్మెస్ గోల్వాల్కర్, హెడ్గేవార్‌లు ప్రకటించారు. నాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంగీకరించకుండా, మన భారత దేశ మువ్వన్నెల జెండాను వ్యతిరేకించి, స్వాతంత్య్ర ఉద్యమానికి తిలోదకాలిచ్చిన నేటి పాలకులు దేశభక్తులుగా చెలామణి అవడం చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందోనన్న ఆందోళన కలుగుతోంది. మతోన్మాదుల చేతుల్లో పాలన, మహనీయులను కించపరుస్తున్న తీరు చూస్తే ఎంతో మనసులో ఆవేదన రగులుతోంది. అందుకే మనుస్మృతికి, రాజ్యాంగానికి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధమిది. ఇందులో కుల,మతాలతో సంబంధం లేని భారతీయులుగా ఒక్కటిగా నిలబడి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగం లేకపోతే సామాజిక న్యాయమనేదే లేదు. ప్రజాస్వామ్యానికి చోటే ఉండదు. ఫెడరలిజం కానరాదు. లౌకిక విలువలు ఇక సమాధే. అందుకే అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసిన ఈరోజున రాజ్యాం గాన్ని రక్షించుకుంటామని ప్రతిఒక్కరూ ప్రతినబూనాలి. అదే నేడు దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలి.
(డిసెంబర్ 25 మనుస్మృతి దహన దినం)
– టి.స్కైలాబ్ బాబు, 9177549646