న్యూఢిల్లీ : తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ‘నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) – శరద్చంద్ర పవార్’ పేరును ఉపయోగించుకోవచ్చునని శరద్ పవార్ గ్రూపునకు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. అజిత్ పవార్ గ్రూపుదే అసలైన ఎన్సీపీ అని ఈ నెల 7న ఎన్నికల కమిషన్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ గ్రూపు పిటిషన్ను జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ నెల 26 నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, తమ గ్రూపునకు ఎలాంటి పేరు, పార్టీ గుర్తింపు లేకుండా ఉంటుందని శరద్ పవార్ తరపు న్యాయవాదులు ధర్మాసనం ముందు తెలిపారు. పార్టీ గుర్తు కేటాయింపు కోసం ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాలని వారికి తెలిపింది. పార్టీకి గుర్తు కేటాయింపుపై ఒక వారంలో నిర్ణయం తీసుకోవాలని ఇసిని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరాఠా కోటాపై మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజుపాటు సమావేశం కానుంది.