గవర్నర్లకు ‘సుప్రీం’ చురక

 'Supreme' Churaka for Governorsఇటీవల గవర్నర్ల పాత్ర, వ్యవహార శైలి, అనుసరిస్తున్న వైఖరితో ప్రతి పక్ష పార్టీల ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. రాజ్యాం గానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయో లేదో పర్య వేక్షించే గవర్నర్‌.. అందుకు విరుద్ధంగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసు కుంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విపక్ష పార్టీలకు ఇదొక ప్రధాన సమస్యగా మారింది. ఆ ప్రభుత్వాలు తమకు ప్రాధాన్యత అనుకున్న ఏ ఒక్క పనినీ ముందుకు సాగనీయకుండా అడ్డంకులు సృష్టించడం గవర్నర్లకు పరి పాటైంది. సంవత్సరాల తరబడి బిల్లు లను తమ వద్దకు ఉంచుకుని ఆమో దించడం లేదు. దీనిని నిరసిస్తూ కేరళ, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ వంటి రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాయి. అయినా ఫలితం శూన్యం. చివరికి సుప్రీంకోర్టు గడప తొక్కితే గానీ.. న్యాయస్థానం గవర్నర్లకు చురకలు అంటించక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన బిల్లుల్ని గవర్నర్‌ విధిగా ఆమోదించాలని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కారని గుర్తు చేసింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పాలనలోని కేరళ, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు తలుపు తట్టే వరకూ గవర్నర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అలవాటై పోయిదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇది చాలా తీవ్రమైన విషయం. దీనిని మేం పరిశీ లించాల్సి ఉంది. దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చినప్పటి నుంచి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నాం.?’ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారంటే.. ఇకముందు ఏ గవర్నరూ జాప్యానికి కారణం కాకూడదని చెప్పకనే చెప్పారు.
గవర్నర్‌ పదవిని రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిగా అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు భంగం వాటిల్లకుండా చూసేలా కేంద్రప్రభుత్వం చొరవ చూపాలని 1994లో ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా కేంద్రం లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆ రకంగా పాటించిన దాఖలాలు అరుదు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువైంది. రాజకీయ, శాసన, ఆర్థిక రంగాలపై ఒక పద్ధతి ప్రకారం దాడి వస్తూ వచ్చింది.
రాష్ట్రప్రభుత్వాలు ఆమోదించిన బిల్లుల విషయంలోనూ అదే దాడి. సాధారణంగా గవర్నర్‌ మంత్రిమండలి సలహాల మేరకు నడచుకోవాలి. మంత్రి వర్గాలు బిల్లులను ఆమోదం కోసం పంపితే గవర్నర్లు కాదనడానికి వీలు లేదు. ప్రజలెన్నుకొన్న శాసనసభలో మెజారిటీ అనుభవిస్తున్న ప్రభుత్వం అదే సభ ఆమోదం పొంది పంపే బిల్లులు ఒకసారి తిప్పి పంపినా మళ్లీ దాన్నే గనుక పంపితే గవర్నర్‌ ఆమోదించి తీరవల్సిందే. గవ ర్నర్లకు కొన్ని విధులు మాత్రమే ఉన్నాయని రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సృష్టంగా పేర్కొ న్నారు. అయినా పరిధి దాటి గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో గత సంవత్సరం సెప్టెంబర్‌ నుండి పెండింగులో ఉన్న బిల్లుల్ని గవర్నర్‌ చాలా నెమ్మదిగా ఆమోదిస్తున్న వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేరళ, తమిళ నాడు, పంజాబ్‌ ప్రభుత్వాలు వాదనలు వినిపించిన నేపథ్యంలో న్యాయస్థానం స్పందించింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించినా పెండింగ్‌లోనే ఉంది. విశ్వ విద్యా లయ చట్ట సవరణ బిల్లు, కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లులు రాజ్‌భవన్‌ గడపదాట లేదు. పంజాబ్‌లో ఆర్థిక బాధ్యత, పన్ను చట్టాల సవరణ వంటి అంశాలకు సంబంధించిన కీలక బిల్లులకు అదే దుస్థితి. నిట్‌ను తమ రాష్ట్రానికి మినహాయించాలని తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసినా గవర్నర్‌ ఆమోదం లభించలేదు. ఇలా రాజ్‌ భవన్‌లను సమాంతర అధికార కేంద్రాలుగా కేంద్రం మార్చే సింది. ఎన్నికైన ప్రభుత్వాలను లెక్కచేయని తనంగా వ్యవ హరిస్తోంది..
ప్రభుత్వ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకం విషయంలో గవర్నర్లు అనుసరిస్తున్న వైఖరిని ఎత్తిచూపుతూ ఆయా ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశాయి. గవర్నర్లపై ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడల్లా పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాదులు దాటవేయడం రివాజుగా మారింది. ఇది కచ్చితంగా ఫెడరల్‌ వ్యవస్థపై దాడే. ఈ పరిస్థితి మారా లంటే కేంద్రం చేతుల్లో గవర్నర్లు కీలుబొమ్మలుగా ఉండ కూడదు. కేంద్రం పెత్తనం ఉండకూడదు. గవర్నర్లను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించి నియమించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యుల ప్యానల్‌ను ఇవ్వాలి. వారిలో ఒకరిని ముఖ్యమంత్రితో సంప్రదించి నియమించాలి.