జైళ్ళలో కుల వివక్షపై సుప్రీం తీర్పు హర్షణీయం

– స్వాగతించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : జైళ్లలో కుల వివక్షను ప్రదర్శించే పద్దతులకు స్వస్తి పలుకుతూ చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) స్వాగతించింది.
ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అభ్యంతరకరమైన, అత్యంత హేయమైన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటంలో న్యాయ వ్యవస్థ చేసుకున్న జోక్యం చాలా కీలకమైనదని పేర్కొంది.
‘గౌరవంతో జీవించే హక్కును బందీలకు కూడా విస్తరించాలి’ అని కోర్టు స్పష్టం చేసింది. వివిధ జైళ్ళ మాన్యువల్స్‌లో, చట్టాల్లో కుల వివక్షను, విభజనను అనుమతించే నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. కుల వివక్ష, అస్పృశ్యతా భావనల ప్రాతిపదికన ఖైదీలకు పనులు కేటాయించడం, వారిని వుంచే ప్రాంతాలను నిర్ణయించడం, ఆహార సన్నాహాలకు సంబంధించిన నిబంధనలను ఎత్తిచూపుతూ వీటన్నింటినీ వెంటనే జైళ్ళ మాన్యువల్స్‌ నుండి తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జైళ్ళ నుండి కుల వివక్షను పూర్తిగా నిర్మూలించేందుకు నిర్దేశించిన మూడు మాసాల్లోగా కోర్టు సూచించిన ఈ చర్యలన్నింటినీ ప్రభుత్వాలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.