సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు

– ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు :కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేయాలని భావించిన కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటుండకూడదని పేర్కొన్నారు. కానీ దురదష్టవశాత్తు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనను గాలికొదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. నిజానికి వాటికి కూడా ఓ పరిమితి ఉంటుందనీ, కానీ దాన్ని దాటి కాంగ్రెస్‌ కేసీఆర్‌పై దుష్ప్రచారాలకు పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడబోవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్‌ సర్కారు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలకాలనీ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. లేదంటే ప్రజా క్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రావటం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికుట్రలు, కుంతంత్రాలు చేసినప్పటికీ చివరికి సత్యమే గెలుస్తుందని పేర్కొన్నారు.