న్యూఢిల్లీ : ఆయుర్వేద, సిద్ధ, యునాని ఔషధాలకు సంబంధించి తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిషేధిస్తున్న డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ రూల్స్, 1945లోని 170వ రూల్‌ను తొలగిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సమాచారం మే 7, 2024 నాటి ఉత్తర్వుల్లో వున్నాయని జస్టిస్ హిమా కొహ్లి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ తెలిపింది. తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలపై సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 24 నిషేధం విధిస్తూ, ఒక వాణిజ్య ప్రకటనను జారీ చేసేందుకు అనుమతించడానికి ముందుగా కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రూల్స్, 1994 ప్రకారం అడ్వర్టయిజర్ల నుండి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
ఆగస్టు 29, 2023 నాటి లేఖను ఉపసంహరించుకోవడానికి బదులుగా జులై 1వ తేదీన 170వ నెంబరు రూల్‌ను తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని, అది, ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా వుంది బెంచ్ పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ నోటిఫికేషన్ అమలుపై స్టే విధించామని బెంచ్ తెలిపింది.
కాగా కేంద్రం వైఖరిని వివరిస్తూ త్వరలో అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నట్లు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ తెలిపారు.
డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ రూల్స్, 1945లో 170వ నిబంధనను ఉల్లంఘిచే ఏ సంస్థపైనా చర్యలు తీసుకోరాదని అధికారులను కోరుతూ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2023 ఆగస్టు 29న కేంద్రం లేఖ రాసింది. ఆ లేఖపై సుప్రీం కోర్టు గత మేలో కేంద్రాన్ని ప్రశ్నించింది.