న్యూఢిల్లీ: పూణేలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొనే ధోల్-తాషా గ్రూపుల్లో వుండే వ్యక్తుల సంఖ్యను 30కి నియంత్రిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు గురువారం స్టే ఇచ్చింది. పూనేలో ధోల్-తాసాకు చాలా సాంస్కృతిక ప్రాధాన్యత వుందని, వందేళ్లకు పైగా ఇది అమలవుతోందని, లోక్‌మాన్య బాల గంగాధర్ తిలక్ దీన్ని ప్రారంభించారని లాయర్ అమిత్ పారు పేర్కొన్నారు. ఆగస్టు 30వ తేదీన ఎన్‌జిటి జారీ చేసిన ఈ ఆదేశాలు ఇటువంటి గ్రూపులను ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. దీనిపై వెంటనే నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ వరకు ఆ ఆదేశాల అమలుపై స్టే విధించాల్సిందిగా బెంచ్ ఆదేశించింది. ప్రతి గ్రూపులోనూ ధోల్ తాషా జంజ్ సభ్యులు 30 కన్నా ఎక్కువ మంది వుండరాదని ఎన్‌జిటి పూనే పోలీసులను ఆదేశించింది. గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయని, అందువల్ల త్వరగా విచారణ చేపట్టాల్సిందిగా న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు.