కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిభావంతులైనవారిని దూరం చేసుకోవాల్సి వస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయవలసి రావడం విచారకరం. హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవుల కోసం కొలీజియం ఎంపిక చేసిన జాబితాపై నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో ఈ పరిస్థితి ఎదురైందన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు మోడీ సర్కారుకు మొట్టికాయలుగా భావించాలి. ‘అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు’ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా వివిధ హైకోర్టుల్లోని జడ్జీ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీకి కొలీజియం వ్యవస్థ చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరు స్పష్టంగా ముందుకొచ్చింది. హైకోర్టు కొలీజియమ్‌లు న్యాయమూర్తుల పదవుల కోసం సిఫార్సు చేసిన దాదాపు 70 పేర్లను కేంద్ర ప్రభుత్వానికిస్తే 2022 నవంబరు నుండి దాదాపు పది మాసాల పాటు పెండింగ్‌లో పెట్టారు. బెంచ్‌లో చేరేందుకు తమ లా ప్రాక్టీస్‌ను వదులుకోవడానికి సుముఖంగా ఉన్న, మెరుగైన ప్రతిభ కలిగిన వారు ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధితులు అవుతున్నారని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అకారణంగా కొందరి పేర్లను తొలగించడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొంది. అంటే సర్కారు తమకు నచ్చని వారిని న్యాయ వ్యవస్థలోకి రానీయకుండా అడ్డుకుంటోందనే కదా! ఖాళీలను అలాగే ఉంచి పరివార్ కుదురు నుండి వచ్చినవారితో న్యాయ వ్యవస్థను నింపేయాలన్నది ప్రభుత్వ పథకం కావచ్చు. కాబట్టి కీలకమైన అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లోకి సంఘీయులను చొప్పించడమే మోడీ సర్కారు లక్ష్యంగా ఉందన్న విమర్శ కాదనలేని వాస్తవం.
ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో మంజూరైన 1,114 జడ్జి పోస్టుల్లో 774మంది మాత్రమే పని చేస్తుండగా 340 ఖాళీలున్నాయి. ఆయా కోర్టుల్లో 60,72,729 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 45,22,626 కేసులు ఏడాది పైబడి పెండింగ్. జడ్జి పోస్టుల్లో 30శాతం పైగా ఖాళీలుంటే కేసుల పెండెన్సీ మరింత పెరుగుతుందే తప్ప పరిష్కారం కావు. ”హైకోర్టులో న్యాయమూర్తి పదవులు చేపట్టేందుకు ముందుకు రావడానికి తిరస్కరిస్తున్నారు. అయినా మేం ప్రయత్నించాం, మంచి టాలెంట్ ఉన్నవారిని న్యాయమూర్తులుగా తీసుకునేందుకు కృషి చేశాం, కానీ పేర్ల విభజన కారణంగా మంచి టాలెంట్‌ను కోల్పోవాల్సి వస్తోంది” అని సర్కారు వైఖరి మూలంగా కొలీజియం కృషి వృధా అవుతున్న తీరును సుప్రీం ధర్మాసనం వివరించింది. ‘న్యాయం ఆలస్యం చేయడం న్యాయాన్ని తిరస్కరించడమే’నన్న నానుడి అందరికీ తెలిసిందే. ఆ పరిస్థితి ఏర్పడడానికి మూల కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తాజా విచారణలో స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ‘కొరడా ఝళిపించి, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారిని ప్రక్షాళన చేయాల్సిన సమయమిదని ఈ తరహాలో ఇకపై జరగరాదని’ పేర్కొనడం సబబు అనిపిస్తోంది. ప్రతిభావంతులైన వారిని అన్ని తరగతులు, ప్రాంతాల నుండి న్యాయ వ్యవస్థలోకి తీసుకోవడం ఎంతో అవసరం.
శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు భారత రాజ్యాంగంలోని ప్రధాన అంగాలు. ప్రజలకు సకాలంలో సరైన న్యాయం అందడం ఎంతో అవసరం. అంతేగాక రాజ్యాంగం ప్రకారం మిగిలిన రెండు వ్యవస్థలు పని చేస్తున్నాయా లేక ఏవైనా ఉల్లంఘనలున్నాయా అన్న అంశాలు కూడా న్యాయవ్యవస్థ పరిధిలోనివే. రాజ్యాంగ అన్వయింపు బాధ్యత దానిదే. కాబట్టి ఇంత కీలకమైన న్యాయ వ్యవస్థలో ఖాళీలన్నిటినీ భర్తీ చేయడం కేంద్ర ప్రభుత్వ విద్యుక్త ధర్మం. ఆ పని వెంటనే చేపట్టాలి. అలాగే కొలీజియం సూచించిన పేర్లలో కొన్నిటిని కారణం చెప్పకుండా తిరస్కరించడం తగదు. తన వైఖరిని సరిచేసు కోవడం అవసరం. సుప్రీం ధర్మాసనం తదుపరి వాయిదాగా నిర్ణయించిన అక్టోబర్ తొమ్మిదిలోగా ఖాళీలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. కనీసం పెండింగ్ పెట్టిన 70 పేర్లయినా క్లియర్ చేయాలి. అటువంటి విజ్ఞతను ప్రదర్శిస్తుందో లేదో వేచి చూడాల్సిందే!