నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సురభి కళాక్షేత్రం ఆధ్వర్యంలో పంజాగుట్ట దుర్గా అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహిస్తున్న వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి, ఆలిండియా రేడియో వ్యాఖ్యాత అయినంపూడి శ్రీలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. స్త్రీ సమానత్వమే సమాజాభివృద్ధికి తొలి మెట్టు అనీ, దానివల్ల దేశ ముఖచిత్రమే మారిపోతుందని అన్నారు. దినోత్సవం పేరుతో ఒక్కరోజు మహిళల్ని గౌరవించడం కాదనీ, రోజూ వారికి ఆ గుర్తింపు ఇవ్వాలని ఆకాంక్షించారు. మరో కవయిత్రి, విశ్లేషకురాలు శ్రీమతి కళా తాటికొండ మాట్లాడుతూ మహిళలు ఇంటాబయటా సవాళ్లను ఎదుర్కొంటూనే అన్ని రంగాల్లో తమదైన ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్ డైరెక్టర్ డాక్టర్ సురభి రమేష్ మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛతోనే సమాజంలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందనీ, దానికోసమే తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. లైఫ్ మేనేజ్‌మెంట్ కోచ్ డాక్టర్ సాయి ఆచార్య, రేడియో జాకీ స్వాతి బొలిశెట్టి తదితరులు పాల్గొన్నారు.