మోడీ సర్కార్‌ ఆదేశాలతోనే సూర్జిత్‌ భవనంపై దాడి

 With the directives of the Modi government Attack on Surjit's building– సెప్టెంబర్‌ ఒకటి నుండి 7 వరకు అధిక ధరలు, నిరుద్యోగంపై దేశవ్యాప్త ఆందోళనలు
– 10 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు : సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రగతిశీల శక్తులకు భయపడిన మోడీ సర్కార్‌ ఢిల్లీలోని సూర్జిత్‌ భవన్‌పై దాడికి పాల్పడిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీ20 సమావేశాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని హరికిషన్‌ సుర్జిత్‌ భవన్‌లో కవులు, కళాకారులు, మేధావులు ఈనెల 18, 19 తేదీల్లో సమావేశాలు నిర్వహించుకుంటుంటే అడ్డుకున్న పోలీసులు.. మీటింగ్‌కు పర్మిషన్‌ లేదని, రద్దు చేసుకోవాలని చెప్పడం బీజేపీ కుట్రలో భాగమేనన్నారు. ఈ సంఘటన బీజేపీ నియంతృత్వ పోకడకు నిదర్శ మన్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలపై సెప్టెంబర్‌ ఒకటి నుండి 7 వరకు వారం రోజులపాటు దేశ వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు.
దేశంలో రోజురోజుకు పేదల సంఖ్య, దరిద్రం పెరుగుతుందని, కోటీశ్వరుల సంఖ్యా పెరుగుతోందని, గతంలో దేశంలో 124 మంది కోటీశ్వరులు ఉంటే ప్రస్తుతం 145 మంది ఉన్నారన్నారు. సెప్టెంబర్‌ 10 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలను అన్ని పోరాట కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని, తెలంగాణలో బీజేపీ ఆటలను కట్టడి చేయడం కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్‌ నాయకులు అబ్బగాని భిక్షం, మడ్డి అంజిబాబు, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.