– ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, పోడు భూములు పేదలకు పంచాలి
– జీవో నెంబర్ 58 ప్రకారం 120 గజాల ఇంటి స్థలం కేటాయించాలి
– సర్కార్ భూముల్లో గుడిసెలేసుకున్న వారికి పట్టాలివ్వాలి
– పోరాటంలో పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి
– భూ చట్టంలో ఉన్న లొసుగులను సవరించాలి : తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక భూ సదస్సు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమగ్ర భూ సర్వే జరిపి ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్, పోడు భూములను అర్హులైన పేదలకు పంచాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో నిర్వహించిన భూ సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో పేదలకు ఇండ్ల స్థలాలు, సాగు భూమి పంచాలని పలు తీర్మానాలను ఐక్యవేదిక కన్వీనర్ ఎస్. వీరయ్య ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో 69 భూ పోరాట కేంద్రాల్లో పేదలు గుడిసెలేసుకొని మూడేండ్ల నుంచి నివాసముంటున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు భూ కేంద్రాల్లోని గుడిసెలను తొలగించి, పోరాటంలో పాల్గొన్న వారిపై అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపించిందని విమర్శించారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలు చోట్ల గుడిసెలను తొలగించి దాడులకు పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని ఆరు గ్యారెంటీల్లో ప్రధాన గ్యారంటిగా ఉన్న ఇండ్ల స్థలాల కోసం మాత్రమే తాము పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ పోరాటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మూడు సార్లు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రెండు సార్లు కలిసి విన్నవించిన సందర్భంలో సానుకూలంగా ఉన్నామని ప్రకటించినా, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. మహబూబాబాద్ భూ పోరాట కేంద్రంలో గుడిసెలను గత ప్రభుత్వం 18 సార్లు తొలగించిందనీ, కాంగ్రెస్ సర్కార్ 19వ సారి గుడిసెలను నేలమట్టం చేసి అక్రమ కేసులు బనాయించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను రేవంత్ ప్రభుత్వం భవిష్యత్‌లో చేయదని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు ఇండ్ల స్థలాలు, సాగు భూములను రేవంత్ సర్కార్ అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య మాట్లాడుతూ 11.5 లక్షల ఎకరాల అటవీ భూములను గుర్తించిన గత ప్రభుత్వం కేవలం 4.2 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చిందని తెలిపారు. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా అటవీ భూములకు పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర భూసర్వే నిర్వహించి, మిగులు భూమిని పేదలకు భూములు పంచాలనీ, ఇండ్ల నిర్మాణానికి రాష్ట్రం రూ.5లక్షలు, కేంద్రం రూ.10 లక్షలు మొత్తం రూ.15 లక్షలివ్వాలివ్వాలనీ, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం చెల్లించాలని రాష్ట్రంలో జరుగుతున్న భూ పోరాటంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. పట్నం ప్రధాన కార్యదర్శి డిజి. నర్సింహరావు మాట్లాడుతూ ఢిల్లీ రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇండ్ల స్థలాలు, సాగు భూమి కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ భూమి కోసం రాష్ట్రంలో జరుగుతున్న పోరాటంలో మహిళలు వీరోచితంగా పోరాడి జైలుకెళ్లారనీ, వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా భూ కేంద్రాల్లో ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు.
పట్టాలు పురుషుల పేరున కాకుండా మహిళల పేరున ప్రభుత్వం పంచాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నేపథ్యలో పేదలు ఇండ్ల స్థలాలు కొనే పరిస్థితి లేదనీ, అర్హులైన పేదలందరికి పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ 2016లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 22 లక్షల మంది ఇండ్లు లేని పేదలున్నారనీ, ఇప్పుడాసంఖ్య 30 లక్షలకు చేరుకుందని చెప్పారు. 2015లో ఇచ్చిన జీవో 58 ప్రకారం ఇండ్లు లేని అర్హులైన పేదలందరికి 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద కార్మికులందరికి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హమీలు అమలు చేయకుంటే మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ సైతం గత ప్రభుత్వం లాగానే నిర్బంధాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. జగిత్యాల భూ పోరాట కేంద్రంలో గుడిసెలేసుకున్న వారిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాడులు చేయించి కేసులు బనాయించారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కోయపోశం గూడెం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు పోవాలని సూచించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ నిలువ నీడ లేని పేదలకు భూమిపై హక్కుందని చెబుతున్న రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా ప్రభుత్వాలు నిర్బంధాన్ని సాగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ పోరాటంలో సవాళ్లను ఎదురించి పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తదితర తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు.