అమ్మతనం అమృతమంత కమ్మదనం. అదో అనిర్వచనీయ అద్వితీయ వరం. అమ్మ అవడమే ఆమె జీవితానికి పరిపూర్ణం. పిల్లలు లేని మహిళ జీవితం నరక సమానంగా భావించే సమాజం. అనారోగ్యాలు, జన్యుపరమైన లోపాలు లాంటి పలు కారణాలతో తల్లితండ్రులు కాలేని కొందరు దంపతులకు అపూర్వ అవకాశంగా ఆధునిక నైపుణ్య వైద్యరంగం ”అద్దె గర్భం లేదా సరోగసీ” ప్రక్రియను ప్రవేశపెట్టింది. నవమాసాలు మోయడమే భారంగా, భౌతిక అందం మెరుపులు తరుగుతుందనే నెపం, వెండి తెర అవకాశాలు తగ్గుతాయనే భయం లాంటి కారణాలతో సినీపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సంతానం కోసం ‘సరోగసీ’ పద్ధతిని రహస్యంగా ఆశ్రయించి తల్లితండ్రులు కావడం సర్వసాధారణం అయ్యింది. 21 జనవరి 2022న ప్రముఖ బాలీవుడ్/హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంపతులు సరోగసీ పద్ధతిలో బిడ్డను కన్నామని సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. 2018 డిసెంబర్‌లో తన కన్న 10 ఏండ్లు చిన్నవాడైన హాలీవుడ్ పాటగాడు నిక్ జోనాస్‌తో బాలీవుడ్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా వివాహం జరగడం మనకు తెలుసు. ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెలిస్‌లో నివాసముంటున్న ప్రియాంక ఇప్పడు కూడా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా తల్లి కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పెద్దలు కూడా ఉండడం విచిత్రకరం. ప్రియాంకకు ఆడ బిడ్డ లేదా మగ బిడ్డ అనే విషయంలో మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు.
తల్లి అండాన్ని తండ్రి వీర్యాన్ని కృత్రిమంగా ఫలధీకరించి మూడో మహిళ గర్భంలో ప్రవేశ పెట్టడాన్ని సరోగసీ (ఐవియఫ్) అంటాం. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లాంటి సినిమా పరిశ్రమలో అగ్ర నటీమణులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, అనంతరం అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనడం ఓ ఘనకార్యమని ఘనంగా ప్రకటించడం విచారకరం. తెలుగు చిత్రసీమ మంచు లక్ష్మి నుంచి బాలీవుడ్ నటీనటులు షారుక్ ఖాన్-గౌరి, సన్నీలియోన్, అమీర్ ఖాన్-కిరణ్ రావు, ఫరా ఖాన్, తుషార్ కపూర్, ఏక్తా కపూర్, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కరణ్ జోహర్ వరకు అనేకులు అద్దె గర్భంతో పిల్లల్ని కనడం చూశాం. శారీరకంగా, మానసికంగా తల్లి కాదగిన అర్హతలున్న మహిళలు సహజ పద్ధతిలో పిల్లల్ని కనకుండా పలు విపరీత ఆక్షేపణీయ కారణాలతో సరోగసీని ఆశ్రయించడం ఆహ్వానించదగిన పరిణామం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పేదరికంలో మగ్గుతున్న భారత మహిళలు మరో మార్గం కనబడక డబ్బుల ఆశకు అద్దె గర్భం మోసేందుకు సిద్ధం అవుతున్నారు. గర్భం దాల్చిన రోజు నుండి అద్దె గర్భం మోస్తున్న గర్భవతి డాక్టర్ల పర్యవేక్షణతో నవ మాసాలు మోసి, ప్రసవానంతరం పసిగుడ్డును తల్లితండ్రులకు వదిలేసి నిష్క్రమిస్తారు. అద్దె గర్భం మోస్తున్న మహిళకు, సరోగసీని ఆశ్రయించిన తల్లితండ్రులకు మధ్య ఎలాంటి సంబంధం, పరిచయం ఉండదు. నవమాసాలు మోసి, పిల్లల్ని కని ఇతరులకు అప్పగించి, అద్దె గర్భ దాతలు డబ్బులు తీసుకొని వెళ్లిపోతారు. రహస్యంగా జరుగుతున్న సరోగసీ ప్రక్రియను ఆరోగ్యంగా ఉండి పిల్లల్ని కనగలిగిన అర్హతలున్న ధనవంతులు, సినిమా నటీమణులు ఆశ్రయించడం సరికాదనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నది. అగ్గువకే అద్దె గర్భాలు దొరుకుతున్న భారతదేశానికి విదేశీయులు కూడా సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి అద్దె గర్భాలను వెతుక్కుంటా ఇండియాకు క్యూ కడుతున్నారు. పలు కారణాలతో పిల్లల్ని కనలేని దంపతులకు వరంగా నిలుస్తున్న సరోగసీని సినీపరిశ్రమకు చెందిన వారు దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.
”మాతృత్వానికి మరో దారి”గా సరోగసీ అవకాశం రావడం ఓ వైపు వరంగా, మరో వైపు శాపంగా మారింది. సరోగసీ ప్రక్రియను క్రమబద్దం చేస్తూ, అర్హతలున్న దంపతులకే పరిమితం చేస్తూ, వ్యాపార ధోరణిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ”సరోగసీ రెగ్యులేషన్ బిల్ – 2019”ను తీసుకురావడం ముదావహం. చట్టం ప్రకారం అద్దె గర్భం ఇస్తున్న మహిళకు వైద్య/పోషకాహార ఖర్చులు మాత్రమే ఇవ్వాలని, ఇతర ధనసహాయం చేయరాదని సూచించబడింది. ”రెడీమేడ్ బేబీస్”ను కనడానికి చిత్రపరిశ్రమ దంపతులు సరోగసీని ఆశ్రయించడం సహేతుకంగా లేదని, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించవద్దని గమనించాలి. పేగుబంధమే అమ్మతనానికి పరిపూర్ణతని నేటి అందాల తారలు ”అమ్మ” పాఠం నేర్చుకోవాలని ఆశిద్దాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037