నేటి నుంచి డిజిటల్‌ కార్డుల సర్వే..

Adilabad– పైలట్‌ ప్రాజెక్టు కింద ఇంటింటికి తిరగాలి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఈ నెల 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు కోసం పైలట్‌ ప్రాజెక్టు కింద మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ గ్రామంలో కుటుంబాల వివరాలు ఇంటింటికీ తిరిగి సేకరించాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. దీనికి సంబంధించి తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఎంపీఓ, మున్సిపల్‌ అధికారులను టీమ్‌ అధికారులుగా వీరితో పాటు ఇద్దరు సిబ్బందిని నియమించామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సంబంధిత సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్‌ కార్డు ఇవ్వాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్‌ వార్డు, గ్రామపంచాయతీని ఫైలెట్‌ ప్రాజెక్ట్‌గా సర్వే బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు డిజిటల్‌ కార్డుకు సంబంధించి, ఫైలట్‌ ప్రాజెక్ట్‌ క్రింద వార్డు, గ్రామ పంచాయతీలలో పూర్తిస్థాయిలో కుటుంబ డిజిటల్‌ కార్డుకు సంబంధించిన పరిశీలన మొత్తం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఈ అంశాన్ని అదనపు కలెక్టర్‌, ఆర్‌డీఓ సమన్వయంతో పర్యవేక్షించాలని అన్నారు. ప్రజలు అందుబాటులో ఉండే సమయంలో సర్వేకు వెళ్ళే విధంగా ప్లాన్‌ చేసుకోవాలని తెలిపారు. కుటుంబ సర్వే అంగన్‌వాడీ టీచర్లకు తెలిసి ఉంటుందని, వారి సహకారం తీసుకోవాలని, కుటుంబ ఫోటో మొబైల్‌ ఫోన్‌లో తీసుకోవాలని, ఫార్మాట్‌లో ఇచ్చిన ప్రకారం డేటాలో పూర్తి వివరాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ నెల 8నాటికి సర్వేను పూర్తి చేయాలని అన్నారు. 9న స్క్రూటినీ జరిపి, 10న సర్వేకు సంబంధించిన అన్ని అంశాలతో సమగ్ర నివేదిక పంపించాలని ఏ ఒక్క కుటుంబం సైతం తప్పిపోకుండా సర్వేను పకడ్బందీగా నిర్వహించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియర్‌ చేయాలి
భూముల క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న పెండింగ్‌లో ఉన్న 1600 దరఖాస్తులను ప్రతీ రోజూ 20 దరఖాస్తులు క్లియర్‌ చేయాలని అన్నారు. ఈ నెల 9వ తేదీలోగా క్లియరెన్స్‌ చేయాలని, అక్టోబర్‌ 9 నుంచి 31 వరకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని సూచించారు. సలహాలు సందేహాలకు టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ హెల్ప్‌ డెస్క్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 9441019479, 8019337150 కాల్‌ చేయాలని, కలెక్టరేట్‌ ఏఓ రామిరెడ్డిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యామలదేవి, ఆర్డీఓ వినోద్‌ కుమార్‌, ఏంఆర్‌ఓలు, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు.