మథుర కృష్ణ జన్మభూమి కేసులో షాహీఈద్గాను సర్వే చేయండి

– అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలు
– మథుర కృష్ణ జన్మభూమి కేసులో షాహీ ఈద్గాను సర్వే చేయండి
న్యూఢిల్లీ: యూపీలోని మథురలో గల షాహీ ఈద్గా మసీదును న్యాయస్థానం నియమించిన, పర్యవేక్షించే అడ్వకేట్‌ కమిషనర్‌ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఆమోదం తెలిపింది. ఇది కృష్ణుడు జన్మించిన ప్రదేశమంటూ హిందుత్వ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం పై విధంగా స్పందించటం గమనార్హం. స్థలాన్ని సర్వే చేయడానికి కమిషన్‌ను నియమించాలని మేము చేసిన విజ్ఞప్తిని కోర్టు అనుమతించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రంజనా అగ్నిహౌత్రిని తెలిపారు. పిటిషనర్ల తరపు మరో న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ మాట్లాడుతూ.. ”అడ్వకేట్‌ కమిషనర్‌ను తప్పనిసరిగా నియమించాలన్న మా డిమాండ్‌ను కోర్టు అనుమతించింది. అడ్వకేట్‌ కమిషనర్‌ ఎవరు? విధివిధానాలు ఎలా ఉంటాయి? త్రిసభ్య కమిటీ వేయాలా? ఈ విషయాలన్నీ డిసెంబర్‌ 18న నిర్ణయించబడతాయి” అని చెప్పారు. 13.37 ఎకరాల భూమిని ఆలయ నిర్వహణకు పూర్తి యాజమాన్యం ఇవ్వాలని కోరుతూ మథురలోని వివిధ కోర్టుల్లో మొత్తం 18 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఈ అన్ని అభ్యర్థనలను కలుపుకొని ఈ అంశంపై తీర్పు కోసం వాటిని స్వయంగా బదిలీ చేసింది. ఆగస్టు 15, 1947న ఉన్న ఏ ప్రార్థనా స్థలం అయినా మతపరమైన హౌదాను కొనసాగించే 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ పిటిషన్‌లను రద్దు చేయాలని ప్రార్థిస్తూ మసీదు పక్షం గతంలో హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని అంతా భావిస్తున్నారు.