బతుకుబాట

ఎప్పట్లాగే
ఉదయం కన్నెర్ర చేసింది
పొరలు పొరలుగా నేల
చీలిపోతూనే కన్నీరొలికింది
కన్నీటితోనే స్నానమాడిన కర్షకుడు
ఊహల మేడపై
జోరుగా పచార్లు కొడుతున్నాడు

నాగలి ఒంటరిదైపోయాక
కందిరీగలతో చెలిమి చేస్తూనే
మట్టి గూటిలో ఒదిగిపోయింది
కాలం అనుకూలించక
కోయిల రాగం మార్చుకుంది
ఎండు గడ్డి దుప్పటి కింద
పొలాలన్నీ సేదతీరుతున్నాయి

ఆకులు రాల్పిన చెట్టేమో
మరో చిగురు కోసం
నొప్పులు పడుతూ అంగలార్చుతోంది
అంతో ఇంతో కడుపుకేసిన మేతను
పదే పదే నెమరు వేయలేక
పశువు కాళ్ళు చాపి పడుకుంది
ఎక్కడో తొంగి చూసిన మేఘం
ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతుంటే
గాలి బుసలు కొట్టి పడగలిప్పింది

ఏరు నెత్తిన ఇసుక బుట్ట
కాళ్ళ కింద కంప చెట్టు
ఎండమావుల పరుగులతో
ఊరు ఉసూరుమంది
శ్మశానం వెంటనే నిద్ర లేచింది
బతుకు బాట అటు వైపే కదిలింది

అరువు పాటలో రైతు బతుకు
అడుగుల లెక్కన అమ్ముడుపోయింది
బిక్కు బిక్కు మంటూ భూమి
రియల్‌ రంగాన ఆశలొదులుకుంది
ఆనందంలోను కన్నీళ్ళే
దు:ఖంలోను కన్నీళ్ళే

– నరెద్దుల రాజారెడ్డి
9666016636