బ‌తికేదెట్టా?

What survived?– ఏడెనిమిది నెలలుగా అందని జీతాలు
– దుర్భరంగా పంచాయతీ కార్మికుల బతుకులు
– బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే నాలుగైదు నెలల పెండింగ్‌
– కాంగ్రెస్‌ సర్కారు వచ్చినంకా అందని జీతాలు
– నేడు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ను ముట్టడించనున్న జీపీ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇచ్చే జీతమే రూ.9,500. ఆపైన ఇద్దరి జీతాన్ని ముగ్గురు పంచుకోవడం. ఆ అరకొర జీతం చెల్లింపులోనూ తీవ్ర జాప్యం. ఒక జిల్లాలో మూడు నెలలు..మరో జిల్లాలో ఆరు నెలలు..ఇంకో జిల్లాలో ఎనిమిది నెలలు…అక్కడక్కడా 12 నెలల నుంచి జీతం అందని దౌర్భాగ్యం. చెత్త ఎతేటోళ్లు, మోరీలు తీసేటోళ్లు, చెప్పిందీ చేసి పడుండేటోళ్లు, వాళ్లేం చేస్తారులే అనుకున్నారో ఏమోగానీ పాలకులు వారిపట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణం. జీతం ఇగొస్తదేమో, అగొస్తదేమో అని కండ్లు కాయలు కాసేదాకా ఎదురుచూసిన పంచాయతీ కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. పెండింగ్‌ జీతాల విడుదల, మల్టీపర్పస్‌ విధానం రద్దు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎంపీడీఓలకు, డీపీఓలకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలిచ్చినా పరిష్కారం కాకపోవడంతో పంచాయతీ కార్మికులంతా గురువారం నాడు హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌కు ముట్టడికి పిలుపునిచ్చారు. సమ్మెకాలంలో కాంగ్రెస్‌ నేతలు తమ వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు వేతనాల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా వేతన సమస్య ఉంది. 23 జిల్లాల్లో 6 నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు అందట్లేదు. 9 జిల్లాల్లో మూడు నుంచి నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఆరు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండగా ఇటీవల పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ, డీపీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు, పోరాటాలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు దిగొచ్చి ప్రస్తుతం మూడు నెలల జీతాలను విడుదల చేశారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌ మండలంలోని పంచాయతీల్లో ఎనిమిది నుంచి 12 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేతేపల్లి మండలంలోనూ 8 నెలలుగా జీతాల్లేవు. అదే జిల్లాలోని పెద్దవూర మండలంలో పెరిగిన వెయ్యి రూపాయల వేతనాన్ని ఇవ్వడం లేదు. అడిషనల్‌ కలెక్టర్‌ పెరిగిన వేతనాలు ఇవ్వాలని అధికారులకు చెప్పినా ఆచరణలో అమలు కావడం లేదు. ఇలా అన్ని జిల్లాల్లోనూ వేతనాల చెల్లింపు విషయంలో ఏదో ఒక సమస్య ఉంది. ఇదేంటని అడిగితే ఇష్టముంటే చేయండి లేకుంటే వెళ్లిపోండి అని అధికారులు హూంకరిస్తున్న పరిస్థితి నెలకొంది. కుటుంబం గడవక ఇండ్లల్లో గొడవలు జరిగి నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో నలుగురు కార్మికులు పనిబంద్‌ పెట్టేశారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోనూ జీతాలు రాక నలుగురు కార్మికులు విధులకు రావడం లేదు. ఏనాటికైనా తమ కొలువు పర్మినెంట్‌ అవుతుందనే ఆశతో వికారాబాద్‌ జిల్లాలో జీతం రాకున్నా ఓ కార్మికుడు పనిచేశాడు. శాలరీ రాకుండా ఎన్ని నెలలు గడుపుతావు? కుటుంబం పరిస్థితేంటి? అంటూ ఇంటి నుంచి ఆయన భార్య వెళ్లిపోయింది. ఇవి మనకు తెలిసిన కొన్ని ఉదహరణలు మాత్రమే. జీతాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకుని వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
మల్టీపర్పస్‌ విధానం ఎందుకొద్దంటున్నారంటే
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మల్టీపర్పస్‌ విధానంలో కార్మికులు పనిచేయాలనే నిబంధన తీసుకొచ్చింది. ఇది కార్మికులను పొట్టనబెట్టుకుంటున్నది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో బతుకమ్మ పండుగ సమయంలో చెరువులో దిగి పనిచేస్తుండగా ముగ్గురు కార్మికులు అందులో పడి చనిపోయారు. సంబంధం లేని పనిచేయటం వారిని కుటుంబానికి దూరం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చుక్కాలబోడు గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశం అనే కార్మికునికి ఎలక్ట్రిషియన్‌ పనిరాదు. అధికారుల ఒత్తిడితో కరెంటు స్తంభం ఎక్కి పనిచేస్తుండగా విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన మహేందర్‌ అనే కార్మికుడు కూడా విద్యుద్ఘాతానికి గురై చేయి, కాలు కోల్పోయి ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండలం కన్నెగల్లుకు చెందిన పంచాయతీ కార్మికుడు జి.నరేశ్‌ కూడా విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ట్రాక్టర్‌ ప్రమాదాల్లోనూ పలువురు కార్మికులు చనిపోయారు. ఇలా ఎందరో కార్మికులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అధికారులు దారుణంగా వ్యవరిస్తూ కారోబార్లతోనూ మోరీలు తీయిస్తున్నారు. మెదక్‌ జిల్లా ఏడుపాయల జాతర సందర్భంగా జిల్లాలోని 21 మండలాల సిబ్బంది అక్కడ పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వారితో సంబంధం లేని పనులు చేయించి రోజుకు రూ.300 ఇచ్చి వెళ్లగొట్టారు. ఇలా సంబంధం లేని పనిచేయించడం, అధికారుల ఒత్తిడితో రాని పని చేసి ప్రాణాలు కోల్పోతుండటంతో పంచాయతీ కార్మికులు మూకుమ్మడిగా వీటిని వ్యతిరేకిస్తున్నారు.
11 నెలల నుంచి జీతం వస్తలేదు
వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నా. 11 నెలల నుంచి జీతమొస్తలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాం. పనిచేసేదానికంటే ఎక్కడికన్నా వెళ్లిపోవాలనిపిస్తున్నది. కానీ, ఎన్నటికైనా పర్మినెంట్‌ కాకపోతుందా? అన్న ఆశతోనే బాధలను ఓర్సుకుంట పనిచేస్తున్న. దయచేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం దయతలచి వెంటనే వేతనాలు ఇప్పించాలి. మాతోని అన్ని పనులు చేయించుకోవడం సరిగాదు. మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయించాలి.
– నీలా ఆంజనేయులు, తేనేపల్లి గ్రామం,
గుర్రంపోడు మండలం, నల్లగొండ జిల్లా
అప్పుసప్పులు చేసి సంసారం ఎల్లదీస్తున్నం
వచ్చేదే చాలీచాలని వేతనం. ఏడునెలల నుంచి ఇస్తలేరు. అప్పుసప్పులు చేసి సంసారం ఎళ్లదీస్తున్నం. సేవలు చేయించుకుంటూ జీతాలివ్వకపోవడంతో జీవితాలు బజారునపడ్డాయి. వెంటనే వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయించి ఆదుకోవాలి. అన్నిపనులు సక్కంగ రాకున్నా మల్టీపర్పస్‌ పేరుతో మాతో పని చేయిస్తున్నారు. మా మండలంలో జానయ్య అనే వ్యక్తి ఎలక్ట్రిషియన్‌ పనిచేసేవాడు. డ్రైవింగ్‌ సరిగా రాకున్నా అతనితో బలవంతంగా ట్రాక్టర్‌ నడిపించడం వల్ల బోల్తా పడి చనిపోయాడు. ఇయ్యాల ఆయన కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం ఎలాంటి సహాయసహకారాలు అందించలేదు. అందుకే ప్రమాదబీమా రూ.10 లక్షలు అమలు చేయాలని కోరుతున్నాం. మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలి. సీనియార్టీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలి.
– ఏడాకుల కోటయ్య, తుంగతుర్తి గ్రామం,
కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా