చంద్రయాన్‌ స్ఫూర్తితో సూర్యయాన్‌

చంద్రయాన్‌3 విజయవంతమైన నేపథ్యం లో మన శాస్త్రవేత్తలు మరో అద్భుతానికి శ్రీకారం చుట్ట బోతున్నారు.ఆ అద్భుతమే సూర్యయాన్‌ మిషన్‌. ఈ మిషన్‌లో భాగంగా సౌరవాయు ఆవర్తనాన్ని సుదూరం నుంచి పరిశీలించడానికి, సూర్యుని వెలుపల ఉన్న పొరలు, సౌరశక్తి కణాలు, వేర్వేరు తరంగ పౌనఃపున్యాల వద్ద ఫోటోస్పియర్‌ (కాంతి మండలం), క్రోమోస్ఫియర్‌ (వర్ణ మండలం)ను ఆధ్యయనం చేయనున్నారు. కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని, పిఎస్‌ఎల్‌ వి-సి 57 వాహననౌక ద్వారా సెప్టెంబర్‌ 2వ శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి పంపబోతున్నారు. గ్రహణాలు వంటివి పరిశోధన లకు అడ్డంకిగా మారకుండా భూమికి సుమారుగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్‌ పాయింట్‌1 చుట్టూ ఉన్న కక్య్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుండి ఈ కేంద్రానికి చేరుకోవడానికి ఉపగ్రహ వాహక నౌకకి సుమారుగా 175 రోజులు పడుతుంది. ఈ ఉపగ్రహం బరువు 1500కిలో గ్రాములు. ఇది ఏడు పేలోడ్‌లను మోసుకెళ్తుంది. ఆ పెలోడ్లులలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనా గ్రాఫ్‌, సోలార్‌ అల్ట్రా వైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్పరిమెంట్‌, ప్లాస్మా ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లోఎనర్జీ ఎక్స్‌ రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌ వన్‌ ఆర్బిటింగ్‌ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగటోమీటర్లాగా ఉన్నాయి. వీటిలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ ప్రధానమైనది. ఇది సూర్యగోళం నుండి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే ఈ మిషన్‌కు అవసరమైన పరికరాలను బెంగళూరులోని యుఆర్‌ రావు శాటిలైట్‌ కేంద్రం నుండి షార్‌ కేంద్రానికి తీసుకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ సజావుగా జరిగితే అక్టోబర్‌లోనే గగనయాన్‌ ప్రయోగానికి శ్రీకారం చుడతారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి మహిళా రోబో వ్యోమమిత్రను మొదటగా పంపి, 2024 ఆఖరి నాటికి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపే ఆలోచన చేస్తున్నారు. 2023 మనదేశ అంతరిక్ష చరిత్రలో గుర్తుండి పోయే సంవత్సరం. రెండు నెలల వ్యవధిలోనే చంద్రయాన్‌ విజయం, సూర్యయాన్‌ ప్రయోగం చేపడుతున్న ఇస్రోకు అభినందనలు.
– డి జె మోహన రావు, 440485824