వీఆర్‌ఏల సర్దుబాటు నిలిపివేత

– విచారణ నాలుగు వారాలకు వాయిదా : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీఆర్‌ఏల సర్దుబాటును హైకోర్టు నిలిపివేసింది. వీఆర్‌ఎలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. జులై 24న జీవోకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 16,758 వీఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేస్తూ లోయర్‌ గ్రేడ్‌ సర్వీస్‌, రికార్డు అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్లుగా ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అందులో భాగంగానే జీవోను, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగ విరమణ వయసు దాటిన మరో 3,797 వీఆర్‌ఏల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియ జరిగిందనీ, తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పలువురు వీఆర్‌ఎలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల వాదనతో ప్రాథమికంగా ఏకీభవించిన హైకోర్టు జీవోలను సస్పెండ్‌ చేస్తూ జులై 24కి ముందు స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.