– వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బెటాలియన్ పోలీసులపై సస్పెన్షన్ ఎత్తేయాలనీ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్.మూర్తి, టి.నాగరాజు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కానిస్టేబుళ్లపై పనిభారం పెంచుతూ తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని వారి కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి బాధలు చెప్పుకుంటే కానిస్టేబుళ్లపైనా, వారి కుటుంబ సభ్యులపైనా నిర్బంధాలు ప్రయోగించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాజా ప్రభుత్వ జీవోతో టీజీఎస్పీ సిబ్బందిపై పనిభారం పెరుగుతున్నదనీ, దీనివల్ల వారి కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ బెటాలియన్ పోలీసుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలనీ, వారిపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు.