– అత్యవసర సేవలు మాత్రమే అందిస్తాం
– ఐఎంఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులలో సేవలను నిలిపివేస్తున్నామని, అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించడం జరుగుతుందని నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శి డా. దామోదర్ రావు, డా.శ్రీశైలం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో యువ పీజీ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా నగరంలో నేడు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. పోలీసులు కేసును సరైన రీతిలో పరిశోధన చేయకపోవడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించిందని విచారణ ఏ విధంగా చేస్తున్నారో మరి విచారణ లో ఎలాంటి రాజకీయం లేకుండా చేస్తే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు. తాము అనేక మంది ప్రాణాలను రక్షించే బాధ్యతలో ఉన్నామని, అలాంటిది తమకే భద్రత లేకపోతే తాము ఎలా విధులు నిర్వహించగలుగుతామని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిందితునికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.