అదృశ్యమైన ఉద్యోగి అనుమానాస్పద మృతి

– ఫార్మా కంపెనీ మిథనాల్‌ ట్యాంకులో మృతదేహం
అనకాపల్లి జిల్లా: జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని ఏడ్మేరాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో అదృశ్యమైన ప్రొడక్షన్‌ మేనేజర్‌ శవమై కనిపించారు. కంపెనీలోని మిథనాల్‌ ట్యాంకులో ఆయన మృతదేహం బయటపడింది. కంపెనీ యాజమాన్యం తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం… మంగళవారం ఉదయం జనరల్‌ డ్యూటీకి కంపెనీ ప్రొడక్షన్‌ మేనేజర్‌ రంది సూర్యనారాయణ (40) వెళ్లారు. ఆ తర్వాత కంపెనీ నుంచి ఇంటికి రాలేదు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సూర్యనారాయణ వాహనం కంపెనీ వద్దే ఉంది. కంపెనీ బయోమెట్రిక్‌ హాజరులో కంపెనీ లోపలికి వచ్చినట్టు నమోదైంది. విధులు ముగించుకొని బయటకు వచ్చే హాజరు పట్టికలో అవుట్‌ లేదు. దీనిపై కంపెనీ యాజమాన్యం ఎటువంటి విషయమూ చెప్పకపోవడంతో కుటుంబీకులు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కర్మాగారం ఎదుట బైఠాయించారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణ మృతదేహం 20 వేల లీటర్ల కెపాసిటీగల మిథనాల్‌ ట్యాంకులో గురువారం బయటపడింది. దీని మ్యాన్‌హోల్‌ కవర్‌ బోల్టు ఎప్పుడూ బిగించే ఉంటుంది. అవసరమైనప్పుడు మెకానిక్‌లు మాత్రమే మాన్‌హోల్‌ కవర్‌ బోల్ట్‌ను ఓపెన్‌ చేసి లోపలికి వెళ్తుంటారు. ప్రొడక్షన్‌ మేనేజర్‌ మృతదేహం దీనిలో ఉండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.కోటి పరిహారం ఇవ్వాలి : సిఐటియు
ఘటనా స్థలానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, పరవాడ జడ్‌పిటిసి సభ్యులు ఎస్‌.రాజు చేరుకున్నారు. అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రొడక్షన్‌ మేనేజర్‌ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలానికి పరవాడ సిఐ ఆర్‌.మల్లికార్జునరావు తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని సిఐ తెలిపారు. కాగా, మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, దహన ఖర్చులకు లక్ష రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.