నవతెలంగాణ-మందమర్రి
అనుమానస్పద స్థితిలో తల్లీ కూతురు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేండ్ల కిందట చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్-ధనలక్ష్మి(36) దంపతులు మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధి దీపక్‌నగర్ ప్రాంతంలో ఉంటూ పాపడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి కూతురు జీవని(16), కొడుకు సిద్దు ఉన్నారు. కాగా, పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లగా మంగళవారం అర్థరాత్రి తల్లీకూతుళ్లు ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న కొడుకు నిద్రలో ఉండటంతో గమనించలేకపోయాడు. ఉదయం లేచి చూసేసరికి అమ్మ, అక్క దూలానికి వేలాడుతూ కనిపించడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. తేరుకున్నాక బంధువులు, స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఇంటిముందు తలుపు గడి పెట్టి ఉండగా వెనుక వైపు తెరిచి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. వ్యాపారం ముగించుకున్నాక రోజూ ఇంటికి తిరిగొచ్చే మురుగున్ మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లికూతుళ్లది ఆత్మహత్యనా.. లేక భర్త మురుగన్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.