శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెల 4న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ,’ ‘శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్‌ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్‌గా ‘శ్వాగ్’ అని టైటిల్ పెట్టాం. ఇది శ్వాగ్ అనే ఒక వంశానికి సంబంధించిన కథ. మాతృ, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా?, ఆడ గొప్పా? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథలతో ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేశా. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. వీటిని ఎలా చేయాలనేది ఛాలెంజ్‌గా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరచే ట్విస్ట్ ఉంటుంది. సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన అంశాలు ఇందులో చాలా ఉన్నాయి’ అని చెప్పారు.