స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తారు… రైతాంగాన్ని అణచివేస్తారు

Swaminathan gets Bharat Ratna... The peasantry is oppressed– ఇది మోడీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం
– బీజేపీ పీడ వదిలించుకుంటేనే దేశానికి మేలు
– తెలంగాణలో ఒక ఎంపీ స్థానంలో పోటీ చేస్తాం
– మిగతా చోట్ల ఇండియా కూటమిలోని పార్టీకి మద్దతు
– బీజేపీతో ఉంటారా? లేదా? బీఆర్‌ఎస్‌ స్పష్టతనివ్వాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
ఒకవైపు ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తారు… ఇంకోవైపు ఢిల్లీలో రైతాంగ ఉద్యమాన్ని అణచివేస్తారు. రైతులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఇంకోవైపు స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయడం లేదు. ఇది మోడీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. అంబేద్కర్‌కు దండ వేస్తారు. సంత్‌ రవిదాస్‌కు దండం పెడతారు. కుల వ్యవస్థను కాపాడే సనాతన ధర్మాన్ని సమర్థిస్తారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు అర్థం చేసుకోకుండా కార్పొరేట్‌ మీడియా, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు.’
– బివి రాఘవులు, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు
ముగిసిన రాష్ట్ర విస్తృత సమావేశం పలు తీర్మానాలకు ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, దేశ సార్వభౌమత్వం, రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని బివి రాఘవులు మర్శించారు.రెండురోజులపాటు జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ముగిసింది. పలు తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత మెరుగైన ఫలితాలను సాధించిందనీ, దానిద్వారా పార్లమెంటు ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ బలపడకుండా, దాని ఆశలు నెరవేరకుండా చేయడమే ముఖ్య కర్తవ్యమన్నారు. తమ బలాన్ని బట్టి ఒక్క స్థానంలోనే పోటీ చేసి మిగతా స్థానాల్లో బీజేపీని ఓడించే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. తద్వారా బీజేపీ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించామన్నారు. సొంతంగా 370, మిత్రులతో కలిసి 400 సీట్లు సాధిస్తామంటూ మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నదని అన్నారు. భారత్‌ వెలిగిపోతున్నదని వాజ్‌పేయి హయాంలో ప్రచారం చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు మోడీకి శృంగభంగం తప్పదని హెచ్చరించారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రారంభమైందనీ, యూపీ, ఢిల్లీలో సయోధ్య కుదురుతున్నదని వివరించారు. ఉమ్మడి శక్తిగా మతోన్మాదాన్ని ఎదుర్కొంటామన్నారు. బీజేపీ పీడను వదిలించుకుంటేనే దేశానికి మేలు కలుగుతుందన్నారు. కేంద్రం పదేండ్లలో తెలంగాణకు చేసిన అన్యాయంపై శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం విధానాలను నిరసిస్తూ కర్నాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం విజయన్‌ ఢిల్లీలో ధర్నా చేశారని గుర్తు చేశారు. మూసీని ప్రతిష్టాత్మక నదిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. గంగానది ప్రక్షాళనకు కేంద్రం నిధులిచ్చిందని గుర్తు చేశారు. అదే తరహాలో మూసీ శుద్ధికి కేంద్రం నిధులివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరాలన్నారు. ప్రయివేటు సంస్థలకివ్వడం సరైంది కాదన్నారు. బీజేపీవైపు ఉంటారో? దూరంగా ఉంటారో? బీఆర్‌ఎస్‌ తేల్చుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు దూరంగా ఉన్నారా? దానిపై పోరాడతారా? స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ పునాది లేకుండా చేయాలన్నారు. చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమిలోని పార్టీలను కలుపుకోకుండా ఎంత నష్టపోయిందో ఆ చేదు అనుభవం ద్వారా కాంగ్రెస్‌ నేర్చుకుందన్నారు. అందుకే మిత్రులతో సయోధ్యతో ఉండాలని భావిస్తున్నదని చెప్పారు.
ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే రెండింటిని అమలు చేసిందనీ, మరో రెండు ఈనెలాఖరులో అమలు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. మిగతా గ్యారంటీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఖజానా ఖాళీ అయ్యిందనే పేరుతో వాటిని అమలు చేయకుండా ఉండడం సరైంది కాదని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రభుత్వ చర్యను బట్టి ప్రతి చర్య ఉంటుందన్నారు. గ్యారంటీల అమలు తీరు ఆధారంగా భవిష్యత్తులో తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. రానున్న కాలంలో సమరశీల పోరాటాలకు సన్నద్ధమవుతామని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ, కనీస వేతనాల జీవోలను అవసరాలకు అనుగుణంగా సవరించాలని డిమాండ్‌ చేశారు. ఇండ్లు, ఇండ్లస్థలాలు, సాగుభూముల సమస్యను పరిష్కరించాలనీ, భూపోరాట కేంద్రాల్లో ప్రజలపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని కోరారు. సమగ్ర భూసర్వే జరిపి ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలన్నారు. ధరణి లోపాలను సవరించాలని చెప్పారు. మూసీనదిలో కాల్యుష్యాన్ని అరికట్టాలనీ, పేదలకు నష్టం లేకుండా మూసీ మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేయాలని కోరారు. ఆ పరివాహక ప్రాంత గ్రామాలకు స్వచ్ఛమైన తాగు, సాగునీరందించాలని సూచించారు. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యావైద్య రంగాలను బలోపేతం చేయాలంటూ రాష్ట్ర విస్తృత సమావేశంలో తీర్మానాలను ఆమోదించామని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. 200 రోజులపని కల్పించాలనీ, కూలి రూ.700 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరువు వచ్చిందనీ, పంటనష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.