ఇటీవలి కాలంలో, తొంభై ఎనిమిదేండ్ల ఎం.ఎస్.స్వామినాథన్ (ఎం.ఎస్.ఎస్) మరణం వేలాదిమంది సాధారణ ప్రజల దు:ఖానికి దారి తీసింది. వారిలో ఎక్కువ మంది గ్రామీణ భారతదేశంలో వ్యవ సాయ పంటలు, పశుపోషణ, మత్స్య సంపద, అటవీ సంపదలో నిమగమై ఉన్న పేదలే. శోకసంద్రంలో మునిగిన పేదలలో మహిళలే అధిక శాతంగా ఉన్నారు. శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన అనేక మంది, విజ్ఞానవంతులైన మధ్యతరగతి వర్గాల ప్రజలు, విధాన నిర్ణేతలు, గ్రామీణాభివృద్ధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు లాంటి ఉన్నత విద్యావంతులు, వృత్తి నైపుణ్యం గల వారంతా ఆయన లేని లోటును పూడ్చలేని నష్టంగా భావిస్తున్నారు.
ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియాలో ఆయన గురించి చేస్తున్న వ్యాఖ్యానాలు, ఇస్తున్న సమాచారం తక్కువైనప్పటికీ, వ్యవ సాయ రంగానికి, ఆహార భద్రతకు ప్రొ.స్వామినాథన్ చేసిన విశేష సేవలను దాదాపు అందరూ ఏకరీతిన ప్రశంసించారు. ఆర్థిక, సామా జిక, పర్యావరణ సుస్థిరత పట్ల ఆయన నిబద్ధత గురించి సరిగ్గా తెలియని కొంతమంది పర్యావరణ ఛాందసవాదుల నుండి సామరస్యత లోటు గురించి కొన్ని సూచనలు ఉన్నాయి, కానీ అవి సాపేక్షంగా చాలా తక్కువగానే ఉన్నాయి.
అనేక క్షేత్రాలలో ఎంఎస్ స్వామినాథన్ విశేషమైన సామర్థ్యాలకు వాస్తవంగా ఇదొక సాక్ష్యం. వాటిలో కొన్నింటిని నేను ఇక్కడ ప్రస్తా విస్తాను. ఆయన తన జ్ఞానానికి మించి గణనీయంగా శాస్త్రీయమైన రచనలు చేయడమే కాకుండా, అలాంటి పనిని విధానాలతో పాటు సాంకేతికతకు కూడా అనుసంధానం చేశాడు. ఆయన శాస్త్ర ఆధారిత వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో అద్భుతమైన కృషి చేసిన సంస్థ లను నిర్మించడంలో లేదా నిర్మించడానికి సహాయం చేయడమే కాక, శాస్త్రవేత్తలు, రైతులు ఒక్కచోట చేరి, ఒకరినుంచి ఒకరు నేర్చుకొన డానికి స్థలాన్ని కూడా సమకూర్చినాడు. ఆయన, విధాన నిర్ణేతలు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వేతర అట్టడుగు అభివృద్ధి కార్యకర్తలతో ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా నిత్యం సంబంధాలు కలిగి ఉన్నాడు.
ఒక ప్రపంచ శాస్త్రవేత్త
ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాలకు అందించిన సేవలు అనేకం, మీడియాలో ప్రసారమైన నివాళుల ద్వారా బయటకు వచ్చాయి. నేను వాటి లోతుల్లోకి వెళ్ళను. ఆయన పనిలో మరింత విస్తృతంగా తెలుసుకోవాల్సిన అంశాలను నొక్కి వక్కాణించి చెప్తాను. ఆయన సేవ లకు భారతదేశంలో వచ్చిన ప్రశంసలను నేను ఇంతకుముందే ప్రస్తావించాను. కానీ ఎం.ఎస్.స్వామినాథన్‌ను ప్రపంచ వ్యాప్తం గా ప్రశంసించారు.
అంతర్జాతీయ స్థాయిలో హరిత విప్లవంలో ఎంఎస్ స్వామినాథన్‌తో పాటు అత్యంత కీలకమైన వ్యక్తి, శాంతి నోబెల్ బహుమతి విజేత, అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన నార్మన్ బోర్లాగ్ (1914-2009) ఇలా పేర్కొన్నాడు: ”హరిత విప్లవం అనేది ఒక జట్టు చేసిన కృషి. దాని అద్భుత మైన అభివృద్ధి ఘనత భారతీయ అధికా ర్లకు, సంస్థలకు, శాస్త్రవేత్తలకు, రైతులకు దక్కాలి. కానీ మెక్సికన్ మరుగుజ్జుల సంభా వ్యత విలువ ముందుగా గుర్తించినందుకు ఆ ఘనత డాక్టర్ స్వామినాథన్‌కే దక్కాలి. ఇదే జరిగి ఉండి ఉండకపోతే, ఆసియాలో హరిత విప్లవం సాధ్యపడి ఉండేడిది కాదు.” స్వామినాథన్ ప్రపంచ శాస్త్రవేత్తల సమాజానికి చెందిన వారు అనే విషయాన్ని గుర్తు చేయడానికే ఈ నా వ్యాఖ్యనాన్ని ఉదహరించాను.
ఎం.ఎస్.స్వామినాథన్, భారతదేశంలో, ప్రపంచంలో ఆకలిని నిర్మూలించాలన్న భావావేశానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన 2005లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎం.ఎస్.ఎస్.ఆర్.ఎఫ్)లో చేసిన చక్కటి ప్రసంగంలో పరిశోధనా పరిణామంతో పాటు అందరికీ ఆహారం, అందరికీ పోషకాహార భద్రతా విధానంపై ఒక స్పష్టమైన దృష్టి కోణాన్ని ఏర్పరచాడు. జనాభా పెరుగుదల రేట్లు, ఆహారోత్పత్తి మధ్య సమతుల్యత నిర్వహణలో 1960ల హరిత విప్లవం ఆశాజనకమైన సందేశాన్ని అందించిందని ఆయన అన్నారు. 1960 వ దశాబ్దం మధ్య కాలం నుండి చివరి వరకు శాస్త్ర విజ్ఞానానికి, వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ, భారతదేశంలో శాస్త్రవిజ్ఞానం, సాంకేతికత, ప్రభుత్వ విధానాలకు మధ్య ఉండే సమన్వయానికి హరిత విప్లవం ఒక ఉదాహరణ అని స్వామినాథన్ అన్నాడు. వరిలో హరిత విప్లవానికి చైనా పుట్టినిల్లు అని ఆయన నొక్కి చెప్పాడు. ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ క్రమంలో విపరీతమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను గుర్తించినప్పటికీ, ఆయన దఅష్టిలో శాస్త్రవిజ్ఞానం, దాని సామాజిక అన్వయిం పులే ప్రపంచంలో ప్రాథమికమైనవి.
1968 తొలినాళ్ళలో తక్కువ భూమిలో లేదా తక్కువ ఖర్చుతో, సాధ్యమైనంత ఎక్కువ దిగుబడిని సాధించాలనే లక్ష్యంతో చేసిన వ్యవసాయానికి సంబంధించిన పర్యావరణ ఆందోళనల గురించి స్వామి నాథన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో తాను చేసిన ప్రసంగంలో హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం అంటే 1990లో ”సతత హరిత విప్లవం” అనే భావనపై ఆయన ఇలా అన్నాడు: ”కొద్దిపాటి సాగు భూమి, వనరులు సరిగాలేని రైతులున్న దేశాలకు, పర్యావరణ లేదా సామాజిక ప్రమాదం లేకుండా శాశ్వతమైన ఉత్పాదక పెరుగుదల అవసరం. హరిత విప్లవం అనేది పర్యావరణ, ఆర్థిక సూత్రాలు మరియు సామాజిక, లింగ సమానత్వ సూత్రాలలో పాతుకుపోయిన సతత హరిత విప్లవంగా మారాలి.”
సుస్థిర వ్యవసాయంలో తలెత్తుతున్న సవాళ్ళను సంగ్రహిస్తూ, స్వామినాథన్ 2005లో చేసిన ప్రసంగంలో ఇలా అన్నారు: ”హరిత విప్లవం నుండి సతత హరిత విప్లవ మార్పుకు అవసరమైన నమూనా సూత్రాన్ని సాధించడంలోని మన సామర్థ్యం, భూగోళ కవోష్ణత (గ్లోబల్ వార్మింగ్), సముద్ర మట్టం పెరుగుదల సవాళ్ళను ఎదుర్కోవడంలోని మన సామర్థ్యాలు, సేంద్రియ వ్యవసాయం, నూతన జన్యు శాస్త్రాల మధ్య సామరస్యత ఏర్పరచే మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. సరిహద్దు సాంకేతికతల్లో నాణ్యమైన వాటిని ఉపయోగించడం ద్వారా, వాటిని పర్యావరణ విజ్ఞానం గల మన ఉన్నతమైన వారసత్వంతో కలపడం ద్వారానే అలాంటి సవాల్‌ను ఎదుర్కొనవచ్చు. సతత హరిత విప్లవం కోసం అవసరమైన పర్యావరణ సాంకేతికతలు, మన భవిష్యత్ వ్యవసాయాన్ని రూపొం దించడానికి అవసరమైన మన వ్యూహానికి దిగువ రేఖగా ఉండాలి.”
వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు సంబంధించి, స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైన ‘నేష నల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ చేసిన ముఖ్యమైన సిఫా ర్సుల చుట్టూ 2005 నుండి ఒక బహిరంగ చర్చ కేంద్రీ కృతమై ఉంది. ఐదు వందలకు పైగా వివిధ రైతు సంఘాల భాగస్వామ్యంతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన నడిచిన చారిత్రాత్మక రైతు ఉద్యమం, స్వామినాథన్ కమిషన్, కనీస మద్దతు ధరపై చేసిన సిఫా ర్సులను అమలు చేయాలని డిమాండ్ చేసింది. వారి ప్రధానమైన డిమాండ్లలో కనీస మద్దతు ధర కూడా ఒకటి. నేడు స్వామినాథన్ ఆయన కనీస మద్దతు ధర ఫార్ములాలు, దేశ వ్యాప్తంగా మిలియన్ల రైతుల వద్దకు చేరి, వారి కుటుంబాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. బలమైన కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయడం లో రైతుల గొంతులు విజయం సాధించాయి. కానీ ఈ విజయం గొప్పతనం ఇంకా పూర్తిగా ప్రశంసించబడాల్సి ఉంది.
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పురోగతికి, అంతే సమానంగా విధాన నిర్ణయాల్లో స్వామినాథన్ అపారమైన సహాయ సహకారాల్ని అందించాడు. ఆయన ముందుండి నడిపించిన హరిత విప్లవం శాస్త్ర విజ్ఞానంలో పాతుకుపోయింది, అది అలా కొనసాగుతూనేఉండాలి. హరిత విప్లవం, సతత హరిత విప్లవాలకు అవతల, కేవలం ఆహార ధాన్యాల ఉత్పత్తికి మాత్రమే కాక ఆహార భద్రత, పోషకాహార భద్రతకు కూడా స్వామినాథన్ సహకారం అందించాడు. ఓ దశాబ్ద కాలం క్రితం జాతీయ ఆహార భద్రతా చట్టం ఆమోదంలో ఆయన కృషి చాలా కీలకమైనది.
లింగ సమానత్వంపై కేంద్రీకరణ అనేది, స్వామినాథన్ కృషి స్థిరమైన అంశం. ఆయన వ్యక్తిగత లక్షణాలు, విభిన్న సంస్థలు, నిర్మా ణాలు, వ్యక్తులతో (కేవలం వ్యవసాయం కోసమే కాక, వ్యవసాయ రంగానికి చెందిన ప్రజల కోసం కూడా) పనిచేసే వీలు కల్పించాయి. చివరగా, రెండు దశాబ్దాల పాటు నేను స్వయంగా పరిశీలించిన స్వామి నాథన్ వ్యక్తిగత లక్షణాలు చాలా అసాధారణమైనవి. ఇవి ఆయన విలువైన జీవితానికి ఎంతగానో దోహదపడ్డాయి.
(”ఫ్రంట్ లైన్” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్, 9848412451
వెంకటేష్ ఆత్రేయ