స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలి

– ప్రావిడెంట్‌ ఫండ్‌ను షేర్‌ మార్కెట్లో పెట్టే చర్యను ఉపసంహరించుకోవాలి
– 16న దేశవ్యాప్త సెక్టోరియల్‌ సమ్మెను జయప్రదం చేయండి
– సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
నవతెలంగాణ -గజ్వేల్‌
‘స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయాలి. ప్రావిడెంట్‌ ఫండ్‌ను షేర్‌ మార్కెట్లో పెట్టే చర్యను ఉపసంహరించుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించనున్న దేశవ్యాప్తంగా సమ్మె, గ్రామీణ బంధును విజయవంతం చేయాలి’ అని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య అన్నారు. శనివారం ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్వేల్‌ నియోజకవర్గం ఏఐటీయూసీ కార్యదర్శి శివలింగకష్ణతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలు పెంచి సామాన్యులపై భారం వేసిందన్నారు. ఉద్యోగులు, కార్మికుల జీతాల నుంచి కట్‌ చేస్తున్న పీఎఫ్‌ డబ్బులు షేర్‌ మార్కెట్లో పెడుతూ భవిష్యనిధికి భద్రత లేకుండా చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటోందని విమర్శించారు. కనీస పెన్షన్‌ గ్యారెంటీ లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లను రూపొందించి కార్మికులకు రక్షణ లేకుండా చేసిందన్నారు. పరిశ్రమ నిర్వచనం మార్చి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా యాజమాన్యాలకు అనుకూలంగా మార్చిందని చెప్పారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పించకపోగా ఈ కాలంలో లక్షలాది చిన్న పరిశ్రమలను మూసి వేసిందన్నారు. దీంతో కోట్ల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి నేటికీ వాటి ఊసే లేదన్నారు. కార్యక్రమంలో సీ ఐ టీ యూ నాయకులు రాజు ఏఐటీయూసీ నాయకులు పోచయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.