అవును, కవిత్వం ప్రవాహం లాంటిదే ఒక్కోసారి పారుతున్న సెలయేరులా అందంగా ఉంటుంది, ఇంకోసారి ఎగసిపడుతున్న జలపాతంలా గుబులు పుట్టిస్తుంది, మరోసారి ప్రవాహాన్ని నిలిపి నిశ్చలంగా ఆలోచించమంటుంది. అసలు మనిషి బతుకంతా కవిత్వమే, నవ్వితే కళ్ళలో పుట్టే తడీ కవిత్వమే. ఏడిస్తే గుండెని తట్టే అలజడీ కవిత్వమే. ముభావపు భావమూ కవిత్వమే. మందహాసపు హాసమూ కవిత్వమే. మాటకు చమక్కులు చేర్చి, పాటకు నడకలు నేర్పి మనిషిలో జీవమై నిలిచింది కవిత్వం. కాలం తీరి రాలుతున్న ఆకు పాడే ఆఖరి పాట కవిత్వం. చిగురులేత పెదాలపై వానచినుకు పెట్టే తొలిముద్దు కవిత్వం. మండుటెండలో కనపడకుండా పోయిన నీడకోసం చెమటచుక్కల వెతుకులాట కవిత్వం. పాడె కర్రల బరువు గుండె చేతులు మోస్తున్నప్పుడు వణికే కనురెప్పల చప్పుడు కవిత్వం, లోకంలో మాటలన్నీ కవిత్వమే అంతకన్నా గొప్ప కవిత్వం ‘మౌనం’.
ప్రతీ మాటకీ ఏదో ఒక భావుకతని అద్ది లోకాన్ని అందంగా మార్చిన కవులకీ కవిత్వానికీ మనం నిజంగా రుణపడి ఉన్నాం. అలాంటి కవిత్వాన్ని రాస్తూ మనతో అక్షరానుబంధాన్ని ఏర్పరుచుకున్న కవి వఝల శివకుమార్. ఇప్పుడు ఆయన చేస్తున్న కవితా కరచాలనం ‘వేళ్ళ రహస్యం’.
ఇది లోకాన్ని చుట్టివచ్చిన కవితా వాక్యం, మోహాల్లేకుండా, మొహమాటాల్లేకుండా, దడుల్లేకుండా, దాపరికాల్లేకుండా సాగే బహిరంగ ప్రవాహ ఝరి దీనికి వ్యాకరణం. ఇది తెగిపడ్డ బొడ్డుపేగుని అక్షరాలకు కలిపి కుట్టి అమ్మకు దండం పెడుతుంది, ఆకాశంలో నిలబడి శతాబ్దాల సహస్రాబ్దాల bతీyషవ సౌందర్యాన్ని ప్రశంసిస్తుంది, తల్లి ఊరుకి ప్రేమ తోరణాలు కట్టి అక్షర హారతులిచ్చి జ్ఞాపకాల దండవేస్తుంది. ఇక్కడ ప్రతిమాటా కవిత్వమే, ఆ ప్రవాహంలో నిన్నూ నన్ను వేరుగా చూడలేం. అంతా ఒకే వాక్యంలో అక్షరాల్లా ఇమిడిపోతాం, ఒకే ప్రవాహంలో కొట్టుకుపోయి ఎక్కడో అనుభూతుల తీరంలో తేలి మనం మర్చిపోయిన మనకోసం వెతుకులాడుతాం.
ఇది మనిషి చుట్టూ దడి కట్టిన అక్షర విన్యాసం, కవిత్వ పరిమళాలను మనసుకి పులుముకొని ఊరంతా వ్యాపించే బాల్యం లాగా మనకు పరిచయమవుతుంది. కుతికల మృత్తికల్లో జలపుట్టించే కవితాంతర్వాహినిగా మనతో ప్రయాణిస్తుంది. పున్నమి పుప్పొడులు జారి నేల చేరినట్టు, పారిజాత పవనాలు కదిలి వర్షం కురిసినట్టు, సీతాకోక చిలుక రెక్కలు ధరణిని మోస్తున్నట్టు, విశ్వదర్శనాన్ని అక్షరావతారంలో చూపించి, అనుభూతుల జల్లులో మనల్ని నిలువెల్లా తడిపి ఆనందిస్తుంది.
ఇది మనసుమగ్గం మీద భావాల దారాలతో నేసిన కవితా వస్త్రం, కప్పుకొని వెచ్చగా నిద్దురపోనూ వచ్చు, ఉలిక్కిపడి మెలుకువలోకి ఉదయించనూ వచ్చు ఇందులో భావుకతా ఉంది జాగరూకతా ఉంది, అక్షరాన్ని కొచ్చగా చెక్కి బల్లాలుగా చేసి గుండెల్లోకి గుచ్చే తీర్పూ ఉంది, వాక్యాలను పువ్వులుగా మార్చి అందానికి నివేదనగా చేర్చే నేర్పూ ఉంది. ఇది రెండు వైపులా కవిత్వమున్న రసైకవాక్యం.
పూలపడవల మీద పున్నమి నీడల్లా, పసితనపు పాలపుంతల్లో పుట్టిన నవ్వుల నది పరవళ్ళలా ఈ కవితా సరాగాల్లో కాలం స్వరవశమవుతుంది. అందమైన పాటలు పాడుకొని కూసింత ఆనందాన్ని బతుకుకు పులుముకుంటుంది. మనచ్చక్షువుల కొసలమీద ఆప్తస్పర్శల ఆనవాళ్ళని తట్టి లేపుతుంది. రసవాద్య తంత్రులకు భావుకతా పరిష్వంగయోగమిచ్చే అక్షరన్యాస కావ్యం ఇది. శ్రమవేదనల శబ్దానికి మనిషి పాడే ఆవేదనా నివేదన ఇది.
శివకుమార్ కవిత్వం చాలాసార్లు ఝటాజూటం విప్పి ఢమరుకధ్వనితో అనర్ఘ్యమైన నాట్యం చేస్తుంది, ఆ శబ్దాలన్నీ అక్షరాల్లోకి చేరి కవితావాక్యాలై మనముందు నిలబడతాయి. మహాశూన్యాల్ని, నిండుతనపు కైదండల్ని ఒకేకాలంలో పరిచయంచేస్తాయి. ఇది మనిషి కోసం అన్వేషించే సాహితీ గవాక్షం, కొమ్మరెమ్మల కొప్పుల్లో పొద్దుపువ్వు పరిమళమై సాగుతుంది. అక్షరాన్ని తన నీడగా ప్రకటించుకొని బరువైన మనసు నుంచి బంగారు కవిత్వాన్ని స్రవించే యోగతత్త్వంగా పరిణామం చెందుతుంది. ఇక్కడ చాలా పద్యాలు పాటల అవతారమెత్తుతాయి. స్వరాలను అరువు తెచ్చుకొని లయల హొయలలో తన్మయత్వపు చిందులేస్తాయి. ఆ అక్షరశతిలో కవిత్వపు స్వరార్ణవ తుషారంలో తనువును, మనసును తడుపుకొని అందమైన దృశ్యంగా నిలిచిపోతాం, మనల్ని మనం మర్చిపోతాం.
దాటొచ్చిన కాలాన్ని మర్లేసుకునే ఊట చెలిమల్లాంటి వాక్యాలు ఈ కవిత్వమంతా అగుపిస్తాయి. దిగులు పొరల కింద దాక్కున్న కాలాన్ని తవ్వి తీసి, విరిగిన సమిష్టిసమాజపు కాల్రెక్కలు అతికించి, ఊరి మన్నులో బతుకువేర్లు తడుపుకోవాలనే తపన ఉన్న మాటలు ఎన్నో ఈ కవిత్వంలో ఎదురొస్తాయి, అన్ని ఊర్లకు మూలవాగులు ఉన్నట్టు మనుషులందరికీ మూలవాసనలుంటాయి, వాటిని తట్టిలేపే ఉషోదయాన్ని, తీరంతో మాట్లాడే అలల ఆరాటాన్ని, గట్ల తీగలమీద శ్రమ తత్వాలు పాడుకునే మట్టిమనుషుల జీవనవైచిత్య్రాన్ని ఈ కవిత్వం గుర్తుచేస్తుంది.
ఇది అలుగులు దుంకిన అక్షరప్రవాహం, జీవన మలుపులని కవిత్వంలోకి ఒంపి గరికపూల పరిమళమై ప్రేమ వెన్నెలని కలగంటుంది. ఇది తొక్కిపెట్టిన పాదాల కింద స్వరబాస్వరం, తలలోపలి వెక్కిరింతలని ఎదిరించి ఊపిరి తీగల ఉద్విగతను ఆత్మగీతంగా పాడుతుంది. ఇది కరవాలాలు విరగని యుద్దక్షేత్రం, ఉమ్మనీటినుంచి ఉప్పునీటిదాకా సాగిన మహాప్రయాణానికి సాక్ష్యంగా నిలబడుతుంది.
భయోద్విగ నేత్రాలతో లోకాన్ని చూస్తున్న పసిడిపిల్లల తరపున ఈ కవిత్వం మాట్లాడుతుంది. దు:ఖపు ఎక్కిళ్లను చిటికెల చప్పుళ్ళతో ఆపే సామాజిక యుద్ధం తరపున ఈ కవిత్వం మాట్లాడుతుంది. మగాల గాయాలకు కన్నీటి మందులు రాస్తున్న ఆడపిల్లల తరపున ఈ కవిత్వం మాట్లాడుతుంది.
బతుకుని ప్రేమించినోడికే ఇలాంటి కవిత్వం రాయడం సాధ్యమవుతుంది. కవితా వస్తువులన్నీ మనిషి చుట్టూనో, అతని సంఘర్షణల చుట్టూనో తిరుగుతాయి. సామాజిక బాధ్యతను నెత్తికెత్తుకుంటాయి. ఈ అక్షరాలు చైతన్య శంఖారావాలు, సంఘర్షణల సంద్రానికి సాంత్వనాతీరాలు.
ఎన్నో కాంతివత్సరాలుగా సాగుతున్న మనిషి జీవన ప్రయాణానికి అక్షరం ప్రాణం పోసింది, కవిత్వం జీవమిచ్చింది, అధ్యయన సొగసులద్దుకొని హద్దులు లేకుండా సాగుతున్న జనజీవనప్రగతియానాన్ని చరిత్రకెక్కించే ప్రతీ ప్రయత్నం అభినందనీయమే, ఇంత కాలంగా కవిత్వమై పూస్తూ తనచుట్టూ భావాల లతలతో అక్షరపూతోట కట్టుకున్న వఝుల శివకుమార్ అభినందనీయుడు, ‘వేళ్ళ రహస్యం’ లోకానికి తన స్పష్టమైన గాఢ కవితాలింగనం.
– గౌతమ్ లింగా,
+ 27 630255994