స్వర్ణోత్సవ బాల సాహితీవేత్త, పొడుపు విడుపుల కవి తల్లావజ్జల మహేశ్‌బాబు

tallavajala mahesh babuతెలుగు పద్యాన్ని అత్యంత సుందరంగా, సరళంగా బాలల పరం చేసిన వారిలో పద్యకవి, బాల సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయ శిక్షణా కళాశాల అధ్యాపకులు తల్లావజ్జల మహేశ్‌బాబు ఒకరు. తెలంగాణంలోని నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో 6 జూన్‌, 1958లో మహేశ్‌బాబు జన్మించారు. శ్రీమతి తల్లావజ్జల వత్సలాబాయి- శ్రీ కృష్ణశర్మలు వీరి తల్లితండ్రులు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ., ఎం.ఈడి చేసి, ‘మాతృభాషా బోధనలో పద్య సాహిత్యం’ అంశంపై ఎం.ఫిల్‌. పరిశోధన చేశారు. ‘సింహాసన ద్వాంత్రింశిక పద ప్రయోగం’ పిహెచ్‌డి పరిశోధనాంశం. నిజామాబాద్‌ జిల్లా విద్యా శిక్షణా సంస్థలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి 2016లో పదవీ విరమణ చేశారు.
మహేశ్‌బాబు కామారెడ్డి ప్రాచ్య కళాశాల విద్యార్థి, తొలినాళ్ళ నుండి పద్యం పట్ల అత్యంత ప్రేమను పెంచుకుని కవిత్వం చెప్పిన కవి తల్లజుడు. పద్యకవిగా, ప్రౌఢకవిగా ఇందూరు సీమలో లబ్ధప్రతిష్టులైనప్పటికీ యాదృచ్చికం కావచ్చు, వీరి తొలి రచన బాల సాహిత్యం కావడం విశేషం. సరిగ్గా యాభైయేండ్ల కింద వీరి తొలి బాల సాహిత్య రచన ‘శ్రీమద్రామాయణం’ పిల్లల నాటిక అచ్చయ్యింది. అచ్చంగా నిన్నటి యేడాది వీరి బాల సాహిత్య స్వర్ణోత్సవ సంవత్సరం. పద్యకావ్యాలతో పాటు నాటకాలు, నాటికలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు వీరి రచనల్లో ఉన్నాయి. ‘సంత్‌ దిగంబరదాసు’ మహేశ్‌బాబు 1992లో రాసిన నాటకం, 2000లో ‘అమరవాణి’ పేర కవితా సంపుటి అచ్చువేశారు. 2015లో ముద్రించిన పద్య కావ్యం ‘అమృత వర్శిణి’.2021లో సంస్కృతంలో పుష్పదన్తకవి వ్రాసిన ‘శ్రీ శివ మహిమ్న్ణ స్త్రోత్రం’కు మహేశ్‌బాబు కూర్చిన తాత్పర్య సహిత తెలుగు పద్యానువాదం అచ్చయ్యింది. ఇవేకాక వీరి మిని కవితా సంపుటి ‘నా మినీలు’, రేడియోలో చేసిన ప్రసంగాల సంపుటి ‘నా రేడియో ప్రసంగాలు’ అచ్చుకావాల్సివుంది. ఇందూరు జిల్లా విద్యా త్రైమాసిక పత్రిక ‘ఇందూరు బాల’కు 2010 నుండి 2013 దాక యిది వెలువడింది. 12 మంది తెలంగాణ కవుల పద్య శతకం ‘తెలంగాణ శతకం’ వీరి సంపాదకత్వంలో వచ్చింది.
1971లో వీరి తొలి రచన అచ్చయ్యింది, అదీ కూడా బాల సాహిత్యం. ‘శ్రీమద్రామాయణం’ పిల్లల నాటిక ఆ రచన. తరువాతి రచన కూడా బాల సాహిత్యమే… నాటికయే… ‘సత్యహరిశ్చంద్ర’ ఆ నాటిక పేరు. తరువాత 1998లో మళ్ళీ పద్యం, ఇతర రూపాల్లో వీరి పిల్లల రచనలు అచ్చయ్యాయి. వాటిలో రెండుసార్లు అచ్చయిన రచన ‘తెలుగువాణి’ నీతి శతకం బాల సాహితీవేత్తగా వీరికి పేరు తెచ్చిపెట్టిన పుస్తకం ‘పొడుపు-విడుపు’ పద్య శతకం, యిది 2007లో వెలువడింది. బాలల కోసం సరళ పద్యాల్లో వ్రాసిన మరో చక్కని పుస్తకం ‘తల్లావజ్జల బాల రామాయణం’. తెలుగువాణి శతకంలోని పద్యాలు ఇందూరు జిల్లాలోని అనేకమంది బాల బాలికలకు కంఠతా వస్తాయి. ‘కొండ గుండె జీల్చి కొనసాగు సెలయేరు/ నీటి యెదల బ్రేల్చి నిప్పు పుట్టు/ కష్ట పడిన విదప కలగవా? ఫలితాలు/ తెలియజూడు మవని తెలుగువాణి’, ‘గుణములేనివాడు ధనవంతుడైనను/ చెల్లబోడు సంఘ జీవితమున/ కలిమి కన్న గుణమె విలువైన ధనమని/ తెలియజూడు మవని తెలుగువాణి’, ‘తల్లిదండ్రి మాట దలయూచి నడచుట/ కన్న ధర్మ మొండు గాన నగునె?’, ‘బద్దకమును మించు బద్ద శత్రువు లేదు/ చురుకుదనము వలన శూరుడగును / కార్యదీక్ష యున్న కాలంబు మనదని/ తెలియజూడు మవని తెలుగువాణి’ వంటి పద్యాలు వీరి సరళమైన భాషనేకాక బాలలకు ఆసక్తికలిగేలా వ్రాసిన విధానాన్ని తెలుపుతాయి.
‘పొడుపు-విడుపు’ మహేశ్‌బాబు పిల్లల కోసం ప్రత్యేకంగా రాసిన పద్యపొడుపు కథల శతకం. ‘అమ్మ’ యనగ నొక్కటై హత్తుకొని యుండు/ ‘నయ్య’ యనగ దూర మరిగిపోవు/ పండినట్టి దొండపండ్ల పోలిక నుండు/ దీని భావ మరసి తెలుపుమోయి’ (పెదవులు), ‘ఆకు జాడలేని అడవిలో దిరుగుచు / నూరు పండ్లరాణి నోట గరచి/ చిట్టి జీవుల నర చేతికందించు'(పేల దువ్వెన). ‘ఒకడు పిడికిలెత్త నూగుచు నిద్దరు / బరువు గలుగు వాని ధరకు నణచి/ తేలికైన వాని దేల్చిలేపుచు నుండ్రు’ (తాసు). ఇటువంటిదే అసక్తికలిగించడంతో పాటు ఆలోచింపజేసేది మరో పొడుపు విడుపును చుద్దాం. ‘చీట్ల జింపునెపుడు చిన్న పిల్లడుకాడు/ కాసులడుగు బిక్షగాడు కాడు!! కొట్టు చుండు ఘంట గుడి బాపడా? కాడు/ దీని భావ మరసి తెలుపుమోయి’ అని… అర్థమయ్యిందనుకుంటాను అతడు బస్‌ కండెక్టర్‌. యిలా నిజజీవితంలో తాను చూసినవి, తనకు తారసపడినవి అనేకం వీరి పొడుపు విడుపుల్లో చేరాయి. ‘పిడికెడంత పిట్ట పిట్టవాలము మూర/ కూర గిన్నెలందు దూరి లేచి/ విస్తరాకు నాకి వేనోళ్ళ నాకించు / దీని భావ మరసి తెలుపు మోయి’ అంటాడు… తెలిసిందా… అదే ‘కూర గరిట’ గురించి. రైలు, దోశ, అద్దం, ఆకాశం, చుక్కలు, బంతి, గొడుగు, సెల్‌ఫోన్‌ యిలా వందకు పైగా పొడుపువిడుపులు వీరి పద్యాల్లో ఉన్నాయి. మహేశ్‌బాబు పద్యాలతో పాటు గేయాలు ఇతర రూపాల్లోనూ పిల్లల కోసం రాసినప్పటికీ పద్యాన్నే ప్రాణంగా ప్రేమించి రాస్తారు తల్లావజ్జల మహేశ్‌బాబు.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548