నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
మతిస్థిమితం లేని వ్యక్తికి కటింగ్,స్నానం చేయించి కొత్తబట్టలు ఇచ్చి స్వయంకృషి సేవా సంస్థ సభ్యులు మంచితనాన్ని చాటుకున్నారు.పూర్తి వివరాల ప్రకారం కాటారం మండలంలోని అంకుశపూర్ గ్రామపంచాయతీ పరిధిలో దస్తగిరిపల్లిలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ వ్యక్తి గురించి స్థానికుల సమాచారంతో తెలుసుకున్న స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ కొట్టే సతీష్, అతని సేవా బృందంతో అక్కడికి చేరుకొని, మతిస్థిమితం లేని వ్యక్తికి నాయి బ్రాహ్మణ సంఘ మిత్రులు రాజు,శ్రీకాంత్ సహకారంతో కటింగ్ చేసి ఆ వ్యక్తి కి స్నానం చేపించి,కొత్త బట్టలు, భోజనం అందించారు.కటింగ్ చేసిన తర్వాత అతనిని కొందరు వ్యక్తులు గుర్తుపట్టి అతని పేరు రాజేష్ స్వగ్రామం నాగారం అని తెలపడంతో నాగారం మాజీ సర్పంచ్ సంబంధిత విషయం తెలిపి అతనిని ఆటోలో నాగారం గ్రామానికి సురక్షితంగా చేర్చారు. కార్యానికి కీలక పాత్ర పోయించిన నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు సముద్రాల రాజు,అడ్డూరి శ్రీకాంత్ లను గ్రామస్తులు, సేవా సంస్థ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి.మతిస్థిమితం కోల్పోయి, కుటుంబాల ఆదరణ నోచుకోక యాచకులుగా సంచరిస్తున్న వారిని చేరదీయాలని,మానవత్వం తో ప్రతి ఒక్కరు స్పందించాలని సంస్థ సభ్యులు పిలుపునిచ్చారు.