– రైల్వే స్టేషన్, బస్టాండుల్లో చైతన్య కార్యక్రమాలు
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
కళాజాత బృందం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మరియు బస్టాండులో స్వీప్ ఓటింగ్ ప్రచార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్వీప్ నోడల్ అధికారి డా.శ్రీధర్ సుమన్ పర్యవేక్షణలో రెండు రవాణా ప్రాంతాల్లో ప్రజలను చైతన్య పరుస్తూ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీప్ నోడల్ అధికారి ప్రయాణికులనుద్దేశించి మాట్లాడుతూ 13న జరుగబోయే ఎన్నికల పర్వంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తప్పక ఓటేయాలని 18 సం.దాటిన ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి, ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కషి చేయాలని అన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బస్టాండ్, రైల్వే స్టేషన్ లో ”ఎన్నికల కౌంట్ డౌన్” కార్యక్రమాలు నిర్వహించడానికి జిల్లా స్థాయి స్వీప్ ప్రణాళిక నిర్ధారించబడింది. అందులో భాగంగా మల్లిఖార్జున చౌరస్తాలో వీడియో ప్రదర్శన తో పాటు ప్రయాణ ప్రాంగణాల్లో కళాజాత బృందం వారిచే చక్కటి సాంస్కతిక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ కళాజాత బృందం వారు గీతాలాపనతో పలువురిని ఆకట్టుకున్నారు. ”ఓటేద్దాం అన్న ఓటేద్దాము, భావి తరాలకు బాట వేద్దాం” అనే పాటతో ఓటింగ్ ప్రాధాన్యతను పాటల రూపంలో చక్కగా వివరించారు. కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్, ఆర్ పీఎఫ్ సిబ్బంది, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్ తో పాటు పలువురు సిబ్బంది సైతం పాల్గొన్నారు.కళాజాత బృందసభ్యులు,స్వీప్ నోడల్ అధికారి సిబ్బంది వెంకటేశం, మాసూం బాబా, సాధిక్ పలువురు ఓటర్లు పాల్గొన్నారు.