కమ్మనైన అమ్మ ముచ్చట

కమ్మనైన అమ్మ ముచ్చటఅమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన త్యాగం, కరుణ, అలుపెరుగని ఓర్పుతో బిడ్డని కనీ, పెద్దవారిని చేస్తుంది. అమ్మ పస్తులుండైనా బిడ్డ కడుపు నింపుతుంది. ఈ ప్రపంచానికి మొట్టమొదటి సారిగా నిన్ను పరిచయం చేసేది అమ్మే. ఎంత సేవ చేసినా అమ్మ రుణం తీర్చలేనిది. అమ్మ మీద అంతులేని ప్రేమను చూపడం బిడ్డ కర్తవ్యం. అలాంటి ప్రేమనే పెంచుకున్నారు మన కవి లేదాళ్ల రాజేశ్వరరావు. అమ్మ మీద ప్రేమను వ్యక్తం చేస్తూ రాసిన తన తృతీయ కవితా సంకలనమే ‘అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి’.
రాజేశ్వరరావు అత్యంత విలక్షణమైన కవి. నిత్యం ఏదో ఒక పత్రికలో అతని కవితలు ప్రచురితం అవుతుంటాయి. ఆ కవిత్వంలో మానవీయ కోణాలు కవితా వస్తువులుగా కనిపిస్తాయి. వాటిని చదువుతుంటే మన చుట్టూ జరిగే సంఘటనలు గుర్తుకువస్తాయి. కొన్ని మన గుండెల్ని పిండేస్తాయి. అలాంటి కవి రాసిన ఎంతో ఆర్ద్రత గల కవితల్ని ఈ కవితా సంకలనంలో చదవొచ్చు. ప్రపంచీకరణలో మట్టి కొట్టుకుపోయిన మానవీయ విలువల్ని ఈయన కవిత్వంలో స్పృశిస్తున్నారు.
‘అమ్మ కాళ్ళకు/ కొనలేని మెత్తని చెప్పులు గుర్తొచ్చి/ కన్నీటి ప్రవాహమవుతాను’ పాడై పోతాయని అమ్మ చెప్పుల్ని తడవకుండా/ చేతిలో పట్టుకుని నడిచేది కొన్నిసార్లు/ ఇప్పుడా చెప్పులు గూట్లో స్తబ్దంగా కనిపిస్తాయి/ ముట్టుకున్నప్పుడల్లా మెత్తగా/ అమ్మ పాదాలు కంది పోతాయేమోనన్నంత మృదువుగా..
ఈ కవితను చదివినప్పుడు కంట్లో నీళ్లు తిరుగుతాయి. మనం బతికినన్నాళ్ళు అమ్మ బతకపోవచ్చు కానీ అమ్మ బతికిన్నాళ్లు మనం బతికే ఉంటాం. అమ్మ ప్రేమను పొందుతూనే ఉంటాం. ఈ కవిత చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి తన తల్లి గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతుంది. ఈ కవిత ‘అక్షరాల తెర టోరి రేడియో’లో కూడా ప్రసారితం అయినది.
‘అనివార్యమై ఆమె ఒక్క రోజు జ్వరంతో నిద్రపోతే/ బ్రహ్మండాలు బద్దలైనట్లు/ సునామీలు చుట్టూ ముసురుకున్నట్లు/ ఆమె చాకిరిని ప్రశంసించని/ కష్టాన్ని కనికరించని/ ఆమె పైనే ఆధారపడ్డ ప్రత్యక్ష పరాన్న జీవిని నేను’.
ఇంట్లో అమ్మ, భార్య చేసే చాకిరిని ఎప్పుడూ మనం గుర్తెరగం. ఆమెకు జ్వరం వచ్చి మంచం ఎక్కిన రోజున కిచెన్‌కి వెళ్లి వంట చేయాలన్నా, ఇంటిని శుభ్రం చేయాలన్నా బ్రహ్మాండం బద్దలవుతుంది. అలవాటు లేని పనిని చేసినప్పుడు ఏదో పాతాళంలోకి దిగబడిపోయినట్లుగా భావిస్తాను. అప్పుడే గుర్తుకొస్తుంది, తాను రోజూ ఎంత కష్టపడుతుందో అని. అయినా తన కష్టాన్ని గుర్తించమని ఎప్పుడూ అడగదు. నిస్వార్ధంగా, ప్రేమగా తన పని తాను చేసుకుంటూ, ఇంట్లో అందరికీ అన్నీ సమకూర్చుతుంది. మనమే ఆమెపై ఆధారపడ్డ పరాన్న జీవులమై ఉన్నాం.
ఇలా ప్రతి కవితలో ఏదో ఒక అంశాన్ని గూర్చి చక్కగా ఆవిష్కరించారు. కవికి వస్తువు కొదవలేదు, వస్తువు లోతుపాతులు బాగా తెలుసు, మనసు చెప్పినట్టు రాసుకోగలిగారు. చదివే ప్రతి పదానికి మనసులో ఆలోచనలు తెరలుతెరలుగా పొంగిపొర్లుతాయి. మానవీయ కోణాల్ని ఆవిష్కరించడంలో ఈ కవి సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. ఇలా సరళంగా అర్థమయ్యేలాగా మనసులోకి చొచ్చుకుపోయే విధంగా ఉన్నాయి కవితలు.
నాతో ఎవరైనా ఉంటే బాగుణ్ణు/ఒక్కణ్ణి మాత్రం ఎంతని పయనించను?/ ఒక్కణ్ణే గుండెల్ని చీల్చుకుని ఏం రాసుకోను?/ గుండెల్లోనైనా ఒకరు ఉండాలి కదా!… నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవనం సాగిస్తున్నారు. ఇంకొకరి గురించి ఆలోచించేంత సమయం ఎక్కడిది. ఉన్న సమయమంతా నేను, నా కుటుంబం అనుకునే కాడికే సరిపోతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా రూపొందాక మానవ బంధాల మాధుర్యం లేకుండా పోతుంది. ఓ ఆపద వచ్చినప్పుడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు, ఒంటరిగా మిగిలినప్పుడు నాతో ఎవరైనా ఉంటే బాగుండు అనే ఆలోచనలో మునిగిపోతాం. ఏదైనా సమస్య తనదాక వస్తే గాని తెలియట్లేదు బంధాల విలువలు.
‘ఏం తీసుకొని పోతాను నాతో నేను/ ప్రోది చేసుకొని/ ఒంటరిగా వెళ్లెప్పుడు/ చిటికెడు కన్నీళ్లు కార్చడానికైనా ఒకరు ఉండాలి…’ అని కవితను ముగిస్తాడు. ఎంత లోతైన భావుకత, చదువుతుంటే మనతో సూటిగా మాట్లాడినట్టే ఉంటుంది. ఈ లోకాన్ని దాటి వెళ్లేటప్పుడు తోడెవరు రాకున్నా, కనీసం మనకోసం ఒక చిటికెడు కన్నీళ్లు రాల్చగలిగే మనుషులను సంపాదించుకోగలగాలి. మనకంటూ ఓ నలుగురు అయినవారు ఉండాలి అంటారు కవి. నాన్న గురించి మరో కవితలో..
‘నాన్నొక దు:ఖ సంద్రం/ గంభీరంగా ఉండే సముద్రానికెంత దు:ఖం!?/ ఎన్ని బాధ్యతల/ నదుల ఘోషాల్ని/ తనలో ఇముడ్చుకోలేదు/ ఎన్ని కన్నీటి ప్రవాహాల్ని తన కన్నుల్లో దాచుకోలేదు నాన్న… అయినా/ నాన్న ఎప్పటికీ/ ఇంకిపోని అనురాగ జలనిధి.
నాన్న బాధ్యతల గురించి త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న కళ్ళల్లో కనిపించని ఎన్నో దు:ఖ సముద్రాలు దాగుంటాయి. అవేవీ తన బిడ్డలకు కనిపించనీయడు. తన పిల్లల కోసం నిత్యం పరితపిస్తూ, తనలాగా తన పిల్లలు ఇబ్బందులకు గురి కావొద్దని ఆకాంక్షించే నిస్వార్థపరుడు. పరిస్థితులు నాన్నని ఎంత క్షోభకి గురిచేసినప్పటికీ, తన పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇయ్యాలనే కలలు కంటూ, మదన పడుతూ ఉంటాడు.
కొన్నింటిని అందరికీ చెప్పలేం/ దాచి దాచి లోలోపల/ కుమిలి పోతాం/ కొన్నింటిని కొంచెం కొంచెం అచేతనంలోకి నెట్టేయాలి/ విడవని బంక లాంటి ఊసుల్ని/ తీగలు తీగలుగా తొలగించాలి మరి/ అవును!/ జ్ఞాపకాలు తొరగా ఆరాలంటే/ వ్యాపకాల వింజామరతో విసరాలి.
మనసులో గూడుకట్టుకున్న అనేకానేక విషయాల్ని అందరితో పంచుకోలేం. అశ్రువులు నిండిన నయనాలు చూసి హేళన చేస్తారనో, లోకువైపోతామనో లోలోనే కుమిలిపోతాం. వాటిని ఏదొక వ్యాపకంతో కొద్దీ కొద్దిగా వదిలించుకోవాలి. అప్పుడే మనసు తేలికవుతుంది. కవిత్వం చాలామంది రాస్తారు, కానీ అనుభవాన్ని రంగరించి అలవోకగా అర్ధమయ్యే విధంగా కొందరే రాస్తారు. అలాంటి కోవకే చెందిన కవి రాజేశ్వరరావు. ఊహించని విధంగా సూక్ష్మ దృష్టితో అలోచించి, తనదైన శైలిలో కవిత్వాన్ని అక్షరీకరిస్తాడు. ఈ కవి నుండి మరెన్నో అద్భుతమైన రచనలు రావాలని సాహిత్య అభినందనలు తెలియజేస్తూ…
– గాజోజి శ్రీనివాస్‌, 9948483560